అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. చలో ఆత్మకూరు నేపథ్యంలో నన్నపనేని రాజకుమారి ఒక దళిత ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఆరోపిస్తుంటే...కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ టీడీపీ ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో అటు వైసీపీ నేతలు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు పోటాపోటీగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను కలిశారు. డ్యూటీలో ఉన్న ఒక దళిత ఎస్సైను కులం పేరుతో దూషించి ఆమె విధులకు ఆటంకం కల్పించారని నన్నపనేని రాజకుమారిపై ఫిర్యాదు చేశారు. నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  

మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు సైతం డీజీపీ గౌతం సవాంగ్ ను కలిశారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో కొందరు నేతలు డీజీపీతో కలిసి నన్నపనేని రాజకుమారిపై తప్పుడు ఆరోపణలు ఆరోపిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా వైయస్ జగన్ 100 రోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ వేసిన పుస్తకాలను సైతం డీజీపీకి ఇచ్చారు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గొడవలు సృష్టించేందుకు తాము చలో ఆత్మకూరుకు పిలుపు ఇవ్వలేదని తెలిపారు. 

పల్నాడులో ఇప్పటికీ చాలామంది తమ గ్రామాల్లో నివసించలేని పరిస్థితి నెలకొందని వారు ఆరోపించారు. ప్రస్తుతం గ్రామాల్లోకి వెళ్లిన వారికి రక్షణ కల్పించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.ఈనెల 18న చలో ఆత్మకూరు నిర్వహించి తీరుతామని చెప్పుకొచ్చారు.

ఇకపోతే చలో ఆత్మకూరు పిలుపులో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితలతోపాటు పలువురు మహిళా నేతలను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పెదకాకాని ఎస్సై అనురాధను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో దూషించారంటూ ఎస్సై ఆరోపించారు. 

దళితులు వల్లే ఈ దరిద్రం అంటూ నన్నపనేని తనను తిట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఆమె మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

నన్నపనేని వ్యాఖ్యల ఎఫెక్ట్: అరెస్ట్ కోరుతూ వైఎస్ఆర్‌సీపీ ర్యాలీ

చంద్రబాబు పిలుపు: నన్నపనేనిపై అట్రాసిటీ కేసు

నన్నపనేనిపై మహిళా ఎస్సై ఆగ్రహం: దళితుల వల్లే దరిద్రం అంటారా అంటూ ఫైర్

పోలీసుల అదుపులో నన్నపనేని రాజకుమారి