నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చిన హైకమాండ్.. మరిన్ని చర్యలకు ఉపక్రమించింది.

దీనిలో భాగంగా ఆయనపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించింది. సస్పెన్షన్ వేటు కంటే అనర్హత వేటు పిటిషన్‌ను స్పీకర్‌కు ఇవ్వడమే మంచిదన్న ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. రేపో మాపో రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్ అందజేసే అవకాశముందని తెలుస్తోంది.

Also Read:వైసీపీలో సద్దుమణగని రఘురామకృష్ణంరాజు ఇష్యూ: ‘ తేడా ’ అంటూ తణుకు ఎమ్మెల్యే వ్యాఖ్యలు

నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు సైతం జగన్‌ను కలిసి ఆయనపై వేటు వేయాల్సిందేనని ఒత్తిడి తీసుకొస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రఘురామకృష్ణంరాజుపై చర్యల ద్వారా భవిష్యత్తులో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవనే సంకేతాలను మిగిలిన వారికి ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. వేటు ఎలా వేయాలనే దానిపై న్యాయనిపుణులు చర్చలు జరిపారు.

Also Read:రఘురామకృష్ణంరాజు ఇష్యూ: కేంద్ర మంత్రులతో ఎంపీ బాలశౌరి వరుస భేటీలు, ఏం జరుగుతోంది?

గతంలో జేడీయూ ఎంపీగా ఉన్న శరద్ యాదవ్‌పై రాజ్యసభ ఛైర్మన్ అనర్హత వేటు వేశారు.ఇదే పద్ధతిలో రఘురామకృష్ణంరాజుపైనా వేటు వేయవచ్చని నిపుణులు సూచించినట్లుగా తెలుస్తోంది.

దీంతో అనర్హత విషయంగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో మాట్లాడాల్సిందిగా జగన్ ఇద్దరు ఎంపీలను ఢిల్లీకి పంపారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ ఈ విషయంగానే రాజధానిలో చక్కర్లు కొట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.