చంద్రబాబును వెంటాడుతున్న కష్టాలు.. వైసీపీ సంచలన ఆరోపణలు.. మరో కేసు తప్పదా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కష్టాలు వెంటాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

YSRCP Sensational Allegations On former cm Chandrababu Naidu over Neeru chettu scheme in his regime ksm

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కష్టాలు వెంటాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు నాయుడు.. గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. మరోవైపు చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు, ఏపీ ఫైబర్ నెట్‌ కేసుల్లో విచారించేందుకు సీఐడీ  ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు కూడా దాఖలు చేసింది. మరోవైపు మరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు, ఏపీ ఫైబర్ నెట్‌, అంగళ్లు ఘర్షణ కేసుల్లో చంద్రబాబు దాఖలు  చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తిరస్కరించింది. 

అయితే గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపిస్తున్న వైసీపీ.. తాజాగా మరో సంచలన ఆరోపణ చేసింది. టీడీపీ హయంలో చేపట్టిన నీరు-చెట్టు పథకంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు వైసీపీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీరు-చెట్టు పథకం కోసం కేటాయించిన డబ్బుల్లో.. రూ. 9,649 కోట్లు జన్మభూమి కమిటీల ద్వారా దోచుకుతిన్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఇసుక, మట్టి ద్వారా రాష్ట్ర ఖజానా నుంచి చంద్రబాబు రూ. 24,750 కోట్లు మింగేశారని ఆరోపణలు చేసింది. 

‘‘లాభం లేనిదే ఏ పథకం కూడా పెట్టలేదు గజదొంగ చంద్రబాబు. నీరు - చెట్టు పథకంలో భాగంగా రూ.12,866 కోట్లు ఖర్చు చేయగా.. అందులో పనుల విలువ మాత్రం రూ. 3,216 కోట్లు గా చూపించారు. మిగిలిన డబ్బులు దాదాపు రూ. 9,649 కోట్లు జన్మభూమి కమిటీల ద్వారా దోచుకుతిన్నాడు. ఇవి కాక ఇసుక, మట్టి ద్వారా రాష్ట్ర ఖజానాకు కన్నం వేసి మరో రూ.24,750 కోట్లు మింగేశాడు’’ అని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

అయితే చంద్రబాబుపై ఈ కొత్త ఆరోపణల నేపథ్యంలో.. మరో  కేసు నమోదు చేస్తారా? అనే చర్చ కూడా సాగుతుంది. ఈ ఆరోపణలతో చంద్రబాబును, నాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాను తప్పుడు కేసులతో జైలుకు పంపేందుకే వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబుపై ఏదో ఒక కేసు నమోదు చేయాలని.. అందుకే జగన్ తప్పుడు ఆరోపణలతో అధికారులను అడ్డం పెట్టుకుని వెంటనే బెయిల్‌ దొరకని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి చంద్రబాబును, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 

జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే నీరు-చెట్టు పథకంపై దర్యాప్తు జరిపించారని.. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని టీడీపీ  వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో 766 పనుల్లో 106 కోట్ల మేర లోపాలున్నట్లుగా గుర్తించామని.. కిందిస్థాయిలో అక్రమాలు జరిగినందున క్షేత్రస్థాయి ఇంజనీరింగ్‌ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించిందని తెలిపాయి. గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే చంద్రబాబును ఏదో ఒక రకంగా ఎక్కువ కాలం జైలులో ఉంచాలని జగన్ ప్రయత్నిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios