రాజమండ్రి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడుగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావుకు వైరల్ ఫీవర్ మాత్రమే ఉందని వైద్యులు ప్రకటించారు. శ్రీనివాసరావును హడావుడిగా జైలు నుండి ఆసుపత్రికి తరలించడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అనారోగ్య కారణాలతో శ్రీనివాసరావును జైలు నుండి  ఆసుపత్రికి తరలించారనే ఆరోపణలను వైసీపీ నేతలు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన శ్రీనివాసరావును జైలు నుండి ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రి సూపరింటెండ్ టి. రమేష్ కిషోర్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ చికిత్స అందించారు.

 డెంగీ, టైఫాయిడ్, హెచ్ఐవీ వంటి పరీక్షలను కూడ నిర్వహించినట్టుగా డాక్టర్లు చెప్పారు. అయితే వైరల్ ఫీవర్‌తోనే శ్రీనివాసరావు బాధపడుతున్నాడని వైద్యులు చెప్పారు.శ్రీనివాసరావు ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైద్యులు తేల్చి చెప్పారు.

శ్రీనివాసరావును ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కలుసుకొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. జైలులో ఎవరూ కలిసినా కూడ ఆ వివరాలను ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉన్నందున ఆసుపత్రిలో కలిసేందుకు వీలుగా అనారోగ్యాన్ని కారణంగా చూపారని  ఆ పార్టీ విమర్శలు చేస్తోంది.శ్రీనివాసరావును ఆసుపత్రిలో  ఆయన సోదరుడు సుబ్బరాజు పరామర్శించారు.