విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎలక్షన్ మోడ్ లోకి వచ్చినట్లు కనబడుతోంది. అందులో భాగంగా జగన్ పాదయాత్రను ముగించేందుకు రెడీ అవుతున్నారు. ఏడాదికాలంగా ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ పై దృష్టిసారించేందుకు రెడీ అవుతున్నారు. 

ప్రజా సమస్యలను ప్రజాక్షేత్రంలోనే తెలుసుకునేందుకు, పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపేందుకు వైఎస్ జగన్ రాష్ట్రంలో ఏడాది కాలంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. 2017 నవంబర్ 6న సొంత జిల్లా కడప నుంచి ప్రజా సంకల్పయాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. 

ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వరకు అప్రతిహాతంగా సాగుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు జగన్ 326 రోజులు పాటు పాదయాత్ర చేసి దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు వైఎస్ జగన్. 

అయితే వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని ఆ పార్టీతోపాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రజాసంకల్పయాత్ర ద్వారా వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్యాష్ చేసుకునేందుకు జగన్ రెడీ అవుతున్నారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో సీట్ల సర్దుబాటు ఇతర సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

అలాగే పోల్ మేనేజ్మెంట్ లో దిట్ట అయిన చంద్రబాబును ఢీకొట్టాలంటే సరైన వ్యూహంతో ముందుకు వెళ్లకపోతే కష్టం. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల శాతంతో జగన్ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటిది మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు జగన్ రెడీ అవుతున్నారు.

ఇప్పటికే పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో వైసీపీ మాంచి జోష్ మీద ఉంది. అటు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కనబడుతోంది. 

అయితే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతోపాటు ఫిబ్రవరి ఆఖరి వారంలో ఎన్నిలక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరగుతుంది. అంటే సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పటికే ఎన్నికల సమరానికి ఆయా పార్టీలు రెడీ అయిపోయాయి. ఏపీ సీఎం చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

గతంలో కాకుండా ఈసారి ఎన్నికల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు సిట్టింగ్ అభ్యర్థులకు సీట్ల కేటాయింపుపై కూడా పలు సూచనలు చేశారు. ఇలా చంద్రబాబు దూసుకుపోతుండటంతో జగన్ కూడా తన పార్టీపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో జగన్ తన పాదయాత్రను పరుగులు పెట్టించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జగన్ పాదయాత్రలో వేగం పెంచి 2019 జనవరి 8 లోపు శ్రీకాకుళం జిల్లాను చుట్టేసి ఇక ప్రజా సంకల్పయాత్రను ముగించాలని భావిస్తున్నారు జగన్. 

పాదయాత్ర తర్వాత నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు మరో కార్యచరణకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన జగన్ ఆ తర్వాత బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బస్సుయాత్ర కేంద్రంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. 

వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక సమస్యలు ఉన్నాయి. వైఎస్ జగన్ ఇంకా ఏ నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించిన దాఖలాలు లేవు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల పనితీరు బాగోలేదని పీకే టీం చెప్పకనే చెప్పింది. 

ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చేస్తున్నారు జగన్. అయితే సమన్వయ కర్తల మార్పుల నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి నెలకొందని వాటిని చక్కదిద్దేందుకు కూడా జగన్ రెడీ అవుతున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం కావడం వల్లే ప్రజాకూటమి బొక్క బోర్లా పడింది. ఈ నేపథ్యంలో అలాంటిది ఇక్కడ చోటు చేసుకోకూడదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే గులాబీ బాస్ కేసీఆర్ లా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి కూడా లేదు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు కూడా ఒకే సమయంలో ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చెయ్యాల్సిన అతిపెద్ద బాధ్యత జగన్ పై ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాలకు వచ్చిన  సర్వే రిపోర్ట్ లను జగన్ పరిశీలిస్తున్నారు. గెలుపుగుర్రాలే లక్ష్యంగా ఇప్పటికే వేట ప్రారంభించిన జగన్ ఆ వేటలో స్పీడ్ మరింతపెంచాలని భావిస్తున్నారు.     

మెుత్తానికి బస్సు యాత్ర ద్వారానే జగన్ ఎన్నికల ప్రచారం చేపట్టబోతున్నారని తెలుస్తోంది. బస్సుయాత్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారనుందని సమాచారం. పాదయాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బస్సు యాత్రతో మరింత ఉత్సాహం వస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.