విజయనగరం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే విజయనగరం జిల్లా అభివృద్ధి చెందిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో పాదయాత్ర చేస్తున్న జగన్ పార్వతీపురం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో అక్టోబర్ 25న కత్తితో దాడి జరిగింది. దాడి అనంతరం వైద్యుల సూచన మేరకు జగన్ 17 రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈనెల 12 నుంచి విజయనగరం జిల్లాలో పాదయత్రను పున:ప్రారంభించిన వైఎస్ జగన్ ప్రస్తుతం పార్వతీపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 

పార్వతీపురం నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం జంఘావతి ప్రాజెక్టును రబ్బరు డ్యామ్ తో నిర్మించారన్నారు. జంఘావతి ప్రాజెక్టును ప్రస్తుతం పట్టించుకునే నాదుడే లేడన్నారు. తన వల్లే తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. వైఎస్ హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని మిగిలిన 10శాతం పనులు పూర్తి చెయ్యలేని దీన స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. 

పార్వతీపురం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య విపరీతంగా ఉందన్నారు. మూడు రోజులకోసారి మంచినీరు వస్తుందని ఆ నీరు కూడా బురద నీరు అంటూ ప్రజలు వాపోతున్నారని జగన్ అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు దోపిడీలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.

టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ జగదీష్ లకు అవినీతి తప్ప ప్రజల సమస్యల పట్టించుకోవడం లేదన్నారు. అంగన్ వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేట్ ఉద్యోగుల దగ్గర నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వరకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. 
 
మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో 19లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే వారిని ఆదుకోవాల్సిన చంద్రబాబు ఆ ఆస్తులను తన బినామీతో కాజెయ్యాలని చూస్తున్నాడని ఆరోపించారు. 

అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ముఖ్యంగా హాయ్ లాండ్ ను దోచుకునేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు అగ్రిగోల్డ్ యాజమాన్యంకు చెందిన హాయ్ లాండ్ నేడు కాదంటూ తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు, సీఐడీ అధికారులు కుమ్మక్కై ఆస్తులను కొట్టెయ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు.

విజయనగరం జిల్లాలో 26 మండలాలు కరువు బారిన పడి నానా అవస్థులు పడుతుంటే కేవలం 4 మండలాలనే కరువు మండలాలుగా గుర్తించి నిర్లక్ష్యం వహిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదన్నారు. అది చేశా ఇది చేశా అంటూ మనవడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని జగన్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును అవినీతికి అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడేనని దుయ్యబుట్టారు.

నాలుగున్నరేళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పట్టించుకోకుండా మార్చినెలలో ఎన్నికలు ఉండగా శంకుస్థాపనల పేరుతో నాటకాలు ఆడుతున్నారని దుయ్యబుట్టారు. కేవలం 40 కిలోమీటర్ల మేర సుజల స్రవంతి పనులు పూర్తి చెయ్యాల్సి ఉండగా కొబ్బరికాయ కొట్టి తానేదో చేస్తున్నట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు అమరావతి రాజధాని పేరుతో భూదోపిడీకి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే గొప్ప రాజధానిని నిర్మిస్తానని చెప్తూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిస్తూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 

చంద్రబాబు పాలనలో అన్ని గొప్పలు తప్ప చేతలు లేవన్నారు. రైతులకు రుణమాఫీ కాలేదని, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ లేదన్నారు. ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి అస్సల్లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. 

నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. కేవలం ఎన్నికలు నాలుగు నెలలు ఉండగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటూ సినిమా చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కోటి డబ్బై రెండు వేల ఇళ్లు ఉంటే కేవలం 2 లక్షల మంది కే నిరుద్యోగ భృతి ఇస్తున్నారని అది కూడా నెలకు వెయ్యి అంటూ ఎద్దేవా చేశారు.