అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలపై షెడ్యూల్ విడుదల చేయడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి ప్రజా, రాజకీయ వ్యవహారాల ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. 

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఛాన్స్ ఇవ్వగా, మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ కు కూడా అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 

ఇకపోతే మూడో అభ్యర్థిపై జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. మూడో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ విపరీతంగా ఉండటంతో ఎవరికి ఇవ్వాలో అన్న అంశంపై జగన్ చర్చిస్తున్నారు. మూడో ఎమ్మెల్సీ స్థానాన్ని పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబులు పోటీ పడుతున్నారు. 

ఇటీవల ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మోపిదేవి వెంకటరమణకు తన కేబినెట్లో సీఎం జగన్ అవకాశం కల్పించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణకు ఒక స్థానం ఖరారైందని సమాచారం. 

మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలో గుంటూరులో రంజాన్ వేడుకలో పాల్గొన్నారు జగన్. ఆ వేడుకల్లో మెుట్టమెుదటి ఎమ్మెల్సీ స్థానం మాజీ ఐపీఎస్ అధికారి, హిందూపురం వైసీపీ ఇంచార్జ్ మహ్మద్ ఇక్బాల్ కు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. 

మైనారిటీ కోటాలో మహ్మద్ ఇక్బాల్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానంపై చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. 

గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన సీఎం జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గాన్ని విడదల రజనీకి త్యాగం చేశారు. అంతేకాదు విడదల రజనీ గెలుపునకు అహర్నిశలు శ్రమించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే రాజంపేట నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి త్యాగం చేశారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గం టికెట్ ను మేడా మల్లికార్జున్ రెడ్డికి కట్టబెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇవ్వాలా అన్న కోణంలో కూడా జగన్ ఆలోచిస్తున్నారు. 

ఇకపోతే ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట ఎన్నికల ప్రచారంలో పండుల రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. 

ఎంపీ పదవిని సైతం వదులుకుని తమ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలా అన్న కోణంలో కూడా సీఎం జగన్ చర్చిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా అవుకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి సైతం ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 

ఈనెల 19 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం సాయంత్రానికి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన ఎమ్మెల్సీలు కరణం బలరాం, ఆళ్లనాని, కోలగట్ల వీరభద్రస్వామిలు ఎన్నికల్లో గెలవడంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ మూడు స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. శాసనసభలో అత్యధిక స్థానాలు వైసీపీకే ఉండటంతో మూడు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌కు పరీక్ష: ఎమ్మెల్సీ పదవులకు పోటాపోటీ