అమరావతి:ఎమ్మెల్సీ పదవిని దక్కించుకొనేందుకు వైఎస్ఆ‌ర్‌సీపీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 26 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 

గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు కూడ ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.  మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై వైఎస్ఆర్‌పీ చీఫ్ వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో రేపల్లే నుండి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ ఓటమి పాలయ్యాడు.ఈ స్థానంలో టీడీపీ అభ్యర్ధి సత్యప్రసాద్ విజయం సాధించారు. మోపిదేవి వెంకటరమణకు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రిగా మోపిదేవి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఈ ఏడాది అక్టోబర్ లోపుగా మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. దీంతో ఒక్క సీటును మోపిదేవి వెంకటరమణకు కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు జగన్ కు నెలకొన్నాయి.  మిగిలిన రెండు సీట్లకు పోటీ నెలకొంది.

అనంతపురం జిల్లా హిందూపురం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన  ఇక్బాల్ టీడీపీ అభ్యర్ధి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు.  అయితే ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని  జగన్ హామీ ఇచ్చాడు. దీంతో రెండో సీటును ఇక్బాల్‌కు జగన్ కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. 

మూడో సీటుకు కర్నూల్ జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డితో పాటు పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీ నుండి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.

చల్లా రామకృష్ణారెడ్డితో పాటు  మరికొందరి పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. విశాఖ నగర ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉంది. విశాఖ నగరంలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు లేనందున ఎమ్మెల్సీ పదవిని విశాఖ నగర నేతలకు ఇవ్వాలని జగన్ ఆలోచనగా కన్పిస్తోందని సమాచారం.

ఒకవేళ జిల్లాకు ఎమ్మెల్సీ  టిక్కెట్టును ఇస్తే ఈ టిక్కెట్టు ఎవరికి ఇస్తారనే విషయమై కూడ పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. విశాఖ నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్, వంశీకృష్ణ, దాడి వీరభద్రరావు తదితరుల పేర్లు కూడ వైఎస్ఆర్‌సీపీ చీఫ్ జగన్ పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం.

మరోవైపు ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ పేరును కూడ వైఎస్ఆర్‌సీపీ చీఫ్ జగన్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఎన్నికల సమయంలో జగన్ ఆయనకు ఈ హామీ ఇచ్చారని చెబుతున్నారు.