అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అర్థమైపోయిందన్నారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి.  టీడీపీ పడవ మునిగిపోతుండటంతో ప్యాకేజీ స్టార్ ను తెరపైకి తీసుకువచ్చారంటూ జనసేన అధినేత పవన్ కల్యాన్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. 

టీడీపీ పని అయిపోయిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకుంటుండటంతో చంద్రబాబు నాయుడుకు దిక్కుతోచక ప్యాకేజీ స్టార్ ను రంగంలోకి దించాడని ఆరోపించారు విజయసాయిరెడ్డి.

ఇసుక దొరక్క ప్రజలు అన్నపానీయాలు మానేశారన్న రీతిలో ఎల్లో మీడియా తీన్మార్ మెుదలు పెట్టిందని విమర్శించారు విజయసాయిరెడ్డి. దృష్టి మళ్లించేందుకు ఎన్ని డ్రామాలు ఆడినా పార్టీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. 

మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉందని జానపద కథల్లో విన్నాం. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా ఇసుకతోనే ముడిపడి ఉందని ఆరోపించారు. సుమారు తొమ్మిదేళ్లుగా ఇసుక దోపిడీతోనే పార్టీ నాయకులను పోషించిన చంద్రబాబు నాయుడు అది అందకపోయేసరికి బెంబేలెత్తిపోతున్నాడన్నారు.
 
చంద్రబాబు నాయుడు ఇసుకదోపిడీకి సీఎం జగన్ అడ్డుకట్ట వేయడంతో గుప్పెడు ఇసుకను కూడా తాకే పరిస్థితి లేకపోవడంతో ప్రపంచం  తలకిందులైనట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. 

ఇకపోతే ఆంధ్రాలో ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ నేతలు నానా హంగామా చేస్తున్నారని అదంతా వారి డ్రామా అంటూ కొట్టిపారేశారు. తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకుందంటే అక్కడ మీరు పాలన చేయలేదు కదా అంటూ టీడీపీ శ్రేణులపై మండిపడ్డారు. 

 తెలుగుదేశం పార్టీ నేతలు సృష్టించిన ఇసుక మాఫియా పెడరెక్కలు విరిచి కట్టడానికి సిఎం జగన్ గారు కొత్త విధానం తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో దోపిడీ పాలన అంతమైందని తెలిసి ప్రకృతి కరుణించిందని చెప్పుకొచ్చారు. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయని ఇదే తేడా అంటూ క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. 

ఇకపోతే నారా లోకేష్ ఒక్కరోజు దీక్షపై కూడా విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న మాలోకానికి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటంటూ ప్రశ్నించారు.  

పిచ్చి కాకపోతే గట్టిగా తినొచ్చుంటాడు అంటూ సెటైర్లు వేశారు. ముఖంలో అలసట కూడా కనిపించడం లేదని వార్తలు చూసిన ప్రజలనుకుంటున్నారని తెలిపారు. నిరాహార దీక్షలకు గౌరవం లేకుండా చేస్తున్నారు కదయ్యా తండ్రి, కొడుకులిద్దరూ అంటూ చంద్రబాబు, లోకేష్ లపై సెటైర్లు వేశారు.  

రాష్ట్రంలో ఇసుకకొరతను నిరసిస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ఒక్కరోజు నిరసన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. 

 

ఈ సవార్తలు కూడా చదవండి

జగన్...మంచి సీఎం అవుతానని ముంచే సీఎం అయ్యావేంటి..: లోకేష్ సెటైర్లు

జైల్లో చింతమనేనిని పరామర్శించిన నారా లోకేష్