అమరావతి: మూడు రాజధానులపై జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 

శుక్రవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతికి ఆనాడు ఏకగ్రీవంగా జగన్ ఆమోదం తెలిపారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.మూడు రాజధానులపై ప్రజల్లోకి వెళ్దామా అని ఆయన వైసీపీకి సవాల్ విసిరారు.  వైసీపీ అధికారంలోకి రావడంతోనే రాష్ట్రానికి దరిద్రం పట్టిందన్నారు. 

also read:కరోనా ప్రభావం తగ్గాక విశాఖకు రాజధాని తరలింపు: మంత్రి పెద్దిరెడ్డి

ఒక్క రాజధాని ఉండగానే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం చరిత్రలో ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. తుగ్లక్ మాత్రమే గతంలో ఇలా వ్యవహరించారు. ఇప్పుడు జగన్ మాత్రమే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

రాజ్యాంగంపై ఈ ప్రభుత్వానికి అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు. అమరావతికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని శంకుస్థాపన చేసిన సమయంలో మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అకారణంగా రాజధానిని ఎందుకు మారుస్తారని ఆయన ప్రశ్నించారు. రాజదాని మార్చడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. అమరావతిని రాజదానిని కొనసాగించాలని టీడీపీ కోరుకొంటుందన్నారు. ఈ విషయంలో తాము అన్ని రకాల పోరాటాలకు సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

వన్ స్టేట్ వన్ కేపిటల్  నినాదమే టీడీపీ విధానమని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్  తొలగించి.... న్యాయస్థానం ద్వారా తిరిగి ఎలా నియమితులయ్యారో అదే రకంగా ఈ చట్టాలపై కోర్టులో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజుగా ఆయన అభిప్రాయపడ్డారు. రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాంతం నుండి ఎందుకు రాజధానిని తరలిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.