గత కొంతకాలంగా టీడీపీపైనా. ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా రెచ్చిపోతున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్టర్ సాక్షిగా మరోసారి రెచ్చిపోయారు. వరుస ట్వీట్లతో రవిప్రకాశ్, చంద్రబాబులపై మండిపడ్డారు.

షేర్ హోల్డర్ల అనుమతి లేకుండా టీవీ9 లోగోను రవిప్రకాశ్ అమ్మేయంపై విజయసాయి తనదైన శైలిలో స్పందించారు. అప్పట్లో నట్వర్‌లాల్‌ అనే చీటర్‌ తాజ్‌మహల్‌నే అమ్మేశాడని తెలిసి విస్తుపోయాం.

ఫోర్జరీ, నిధుల స్వాహా, షేర్ల అమ్మకాలు(బోగస్‌), టీవీ9 ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌ అమ్మకాలు... రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ‘మెరుగైన సమాజం’ ప్రొడ్యూసర్‌ మోసాలు నైజీరియన్‌ మోసగాళ్ళను తలపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.

అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశించడం, చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తుండటం పైనా ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్‌ బూత్‌లో ఓటర్లకు బదులు ఓ మహిళా అధికారి తానే తృణమూల్‌ గుర్తు బటన్‌ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది.

ఇది చంద్రబాబుకు కనిపించలేదా?. ఎన్నికల కమిషన్‌ మెత్తగా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో అదే తరహా రిగ్గింగ్‌కు పాల్పడేవాడు కాదా?’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు.

23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు  చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నామంటూ ట్వీట్ చేశారు.