అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు అధికారం పోయేసరికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు.

మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అని అనేక రకాలుగా దూషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. 

మోదీని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపినట్టు మీడియా సాక్షిగా చెప్పిన విషయాన్ని ఎవరూ మరచిపోరు చంద్రబాబు అంటూ తిట్టిపోశారు. హుందాగా ఉండాలనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లలేదా అని ప్రశ్నించారు. 

చంద్రబాబు వెళ్లలేకపోవడం వల్లే మాలోకం నిలబడిన మంగళగిరి మెహం కూడా పవన్ కళ్యాణ్ చూడలేదేమోనంటూ సెటైర్లు వేశారు. ఆ విధంగానైనా తామిద్దరం పార్ట్ నర్లమన్న విషయాన్ని బయటపెట్టుకున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. చీకటి పొత్తుల విషయాలను ప్రజలు గ్రహించారు కాబట్టే గట్టి గుణపాఠం చెప్పారని విమర్శించారు ఎంపీ విజయసాయిరెడ్డి.