అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. సిగ్గులేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లు మొదట ఉంటాయంటూ చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లను ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశారు. 

చంద్రబాబు నాయుడుతోపాటు కిరసనాయిలు కూడా తప్పనిసరిగా ఉంటాడని తెలిపారు. సీఎం జగన్‌ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తూ మీ పుత్ర రత్నం పెట్టిన ట్వీట్లు సుమతి శతకాల్లా కనిపిస్తున్నాయా బాబూ అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

సోషల్ మీడియా వాల్స్‌పై ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పోస్ట్ చేస్తారు. అనాగరిక దూషణలుంటే ఫేస్‌బుక్‌కి ఫిర్యాదు చేయొచ్చు అంటూ సూచించారు. చంద్రజ్యోతి ఎన్ని మంటలు రాజేయాలని చూసినా లాభం లేకుండా పోయిందనేదే సారు అసలు బాధ అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. 

వైసీపీపైనా, సీఎం జగన్‌పైనా నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని విజయసాయిరెడ్డి విమర్శించారు.   

చంద్రబాబు, ఆయన బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా వారి అరాచకాలన్నింటినీ బయట పెట్టిందని చెప్పుకొచ్చారు. అందుకేనేమో ఈ ఏడుపు అంటూ తిట్టిపోశారు. 

అధికారం నాయుడు అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. తనను అంతా మరచిపోతున్నారనే భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. 
 
గ్రామ సచివాలయం పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని రాయించినా సీఎం జగన్‌ స్పందించక పోవడంతో ఆయనలోని నిరాస, నిస్పృహలు కట్టలు తెంచుకున్నాయని ఆరోపించారు. అందువల్లే అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు విజయసాయిరెడ్డి.