అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

గత ఎన్నికల్లో పాలిచ్చే ఆవును కాదని దున్నను తెచ్చుకున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పాడి ఆవులాంటి  ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా అంటూ సెటైర్లు వేశారు. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్ అంటూ విమర్శించారు.

 

రాజన్నరాజ్యానికి ఇదే నిదర్శనం:
దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారని చెప్పుకొచ్చారు. పట్టుదలతో చేస్తే ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి అయ్యేదన్నారు. 

ప్రాజెక్టు పూర్తి చేస్తే 7లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేదని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు అవేమీ పట్టనట్లు ఐదేళ్లు కాలం గడిపేశారంటూ విమర్శించారు. ప్రధాని అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదని విమర్శించారు.

మరోవైపు మహానేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదున్నరేళ్లు వర్షాలకు కొదవ లేదని చెప్పుకొచ్చారు. జలాశయాలన్నీ నిండి రెండు పంటలు పండాయని గుర్తు చేశారు. మెట్ట చేలు కూడా కళకళలాడాయని తెలిపారు. ఇప్పుడు మళ్లీ రాజన్న రాజ్యం వచ్చిందంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్లన్నీ నిండుతున్నాయని ఫలితంగా రైతుల మోముల్లో ఒక భరోసా కనిపిస్తోందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీలో టీడీపీ విలీనానికి చంద్రబాబు రాయబారం : విజయసాయి సంచలన వ్యాఖ్యలు