ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి.. బెయిల్‌పై బయటకొస్తే సాక్ష్యాలు చెరిపేయరా : బాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘ రాష్ట్రపతి, ప్రధాని పదవులు ఎవరికెళ్ళాలో నిర్ణయించిన వ్యక్తి....ఢిల్లీలో చక్రాలు తిప్పిన వ్యక్తి.... స్వయంప్రకటిత సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కర్త, ఆద్యుడు...సంపద సృష్టికర్తగా చెప్పుకునే మీరు....స్కాంలు చేసి బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యాలు చెరిపేయరా? న్యాయం, సత్యం, ధర్మాన్ని బతకనిస్తారా బాబూ ’’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లో తమ వాదనలు కూడా వినాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో గురువారంనాడు కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని, రిమాండ్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఈ నెల 22న కొట్టివేసింది.
దీంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో నిన్న విచారణ ప్రారంభమైంది. అయితే సుప్రీంకోర్టు బెంచ్ లో ఎస్‌వీఎన్ భట్ మాత్రం నాట్ బి ఫోర్ మీ అని ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి వెళ్లింది.ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. జస్టిస్ భట్టి, ఖన్నా బెంచ్ వేరే బెంచ్‌కు బదిలీ చేయడంతో సీజేఐని ఆశ్రయించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు సిద్ధార్థ్ లూథ్రా. త్వరగా లిస్ట్ చేయాలన్నదే తమ మొదటి అభ్యర్దన అని ఆయన పేర్కొన్నారు.
మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్ధన అని సిద్ధార్థ్ తెలిపారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న చీఫ్ జస్టిస్.. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. అక్టోబర్ 3న అన్ని విషయాలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.