మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నాయకుడు మరణిస్తే హుందాగా నివాళులు అర్పించాల్సింది పోయి.. నీచమైన కామెంట్స్ చేయడం టీడీపీ నేతలకే సాధ్యమన్నారు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (mekapati goutham reddy) హఠాన్మరణంపై అనుమానాలు ఉన్నాయని, ఆయన మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి (bandaru satyanarayana murthy) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా ఈ వివాదంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.
'ఒక నాయకుడు మరణిస్తే హుందాగా నివాళులు అర్పించాల్సింది పోయి.. నీచమైన కామెంట్స్ చేయడం టీడీపీ నేతలకే సాధ్యం. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి మాటలు వింటే...టీడీపీ మానసిక వైకల్యం అర్థమవుతుంది. పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పార్టీ. ఆర్ఐపీ వైజాగ్ టీడీపీ' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి ఆరోపణలపై స్పందించిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. 'గురువింద కూతలు నువ్వే కూయాలి కసాయి! శవం దొరికితే రాజకీయం చేసే జగన్ రెడ్డి అండ్ కో కూడా నీతులు మాట్లాడటం విడ్డురంగా ఉంది' అని ఆయన అన్నారు. గతంలో విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీటునూ ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు పోస్ట్ చేశారు.
అంతకుముందు మాజీ మంత్రి Ayyanna Patrudu ఇంటికి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు బుధవారం నాడు చేరుకొన్నారు. ఏపీ సీఎం YS Jaganపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. అయితే అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే అయ్యన్న కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన YCP నేత Rama Krishna ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌ను అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషించారంటూ రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లజర్లలో నిర్వహించిన NTR విగ్రహావిష్కరణ సభలో అయ్యనపాత్రుడు మాట్లాడుతూ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని రామకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. రామకృష్ణ ఫిర్యాదును స్వీకరించిన నల్లజర్ల పోలీసులు.. అయ్యన్నపాత్రుడిపై ఐపీసీలోని 153A, 505(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.