కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. దీనికి సమయం దగ్గరపడుతుండటం, దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా లేక పొడిగిస్తారా అని దేశవ్యాప్తం చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను పొడిగించే ఉద్దేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజారోగ్య సమస్యలు తలెత్తడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు.

Also Read:మడమ తిప్పని వైఎస్ జగన్: ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కు ఉద్వాసన

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతోనే ముందుకెళ్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి థర్మల్ విద్యుత్తు ప్రాజెక్ట్ జీవో రద్దు చేయడంతో  పాటు తంపర భూములు వడ్డితాండ్ర స్వదేశీ మత్య్సకారులకు త్వరలో అప్పగిస్తామని  ఆయన హామీ ఇచ్చారు.

అలాగే కాకరాపల్లి ఉద్యమంలో నమోదైన కేసులను డీజీపీతో మాట్లాడి ఎత్తివేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ కొనసాగింపుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

మరోవైపు లాక్‌డౌన్ కొనసాగింపుపై తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లాక్‌డౌన్, హాట్‌స్పాట్‌లకే పరిమితం చేయాలంటూ ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంకేతాలు ఇచ్చారు.

Also Read:వారి వల్లనే కేసులు ఎక్కువ, వీరికి సెల్యూట్: వైఎస్ జగన్

రేపు ప్రధానితో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ ఇదే విషయం చెప్పే  అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 12 గంటల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అనంతపురం జిల్లాలో ఈ రెండు కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 892 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్‌ సోకినట్లుగా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది.