జీవితాంతం జైలులో వుండాల్సినన్ని స్కాంలు.. కాస్త లేట్ అయ్యింది కానీ : చంద్రబాబు అరెస్ట్‌పై విజయసాయిరెడ్డి
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. స్వ ప్రయోజనాల కోసం చంద్రబాబు.. ప్రజాధనాన్ని బోగస్ కంపెనీలకు మళ్లించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. కాస్త లేట్ అయితే అయ్యింది గాని పూర్తి ఆధారాలతో అరెస్ట్ జరిగిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. చంద్రబాబు అండ్ కో జీవితాంతం జైలులో వుండాల్సినన్ని కుంభకోణాలకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రామోజీ రావుకు కూడా చట్టం వర్తిస్తుందని.. ఇన్నాళ్లూ తప్పించుకోగలిగారని, కానీ ఇప్పుడు శిక్షా సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.
2014-19 మధ్య టీడీపీ అధినేత లెక్కలేనన్ని నేరాలకు పాల్పడ్డారని.. వాటిలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం ఒకటని విజయసాయిరెడ్డి చెప్పారు. మనీలాండరింగ్, అధికార దుర్వినియోగం, మోసం వంటి అంశాలు ఇందులో స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. స్వ ప్రయోజనాల కోసం చంద్రబాబు.. ప్రజాధనాన్ని బోగస్ కంపెనీలకు మళ్లించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సీమెన్స్ కంపెనీతో ఎంవోయూ పేరిట భారీ కుంభకోణానికి సూత్రధారిగా నిలిచారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన స్కాంలకు సంబంధించి సీఐడీ, ఏసీబీ వద్ద ఆధారాలున్నాయని.. సంక్షేమం, అభివృద్ధి పేరిట దోపిడీకి పాల్పడటం నేరమని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
ALso Read: చంద్రబాబేలే అని చట్టం ఊరుకుంటుందా.. నిప్పులాంటి మనిషైతే కోర్టులో తేల్చుకోవాలి : బొత్స సత్యనారాయణ
అంతకుముందు చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగానే జరిగిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని.. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే సీఐడీ అరెస్ట్ చేసిందని బొత్స సత్యనారాయణ తెలిపారు. నిప్పులాంటి మనిషి అయితే కోర్టుల్లో తేల్చుకోవాలని బొత్స చురకలంటించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. అవినీతికి పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని బొత్స పేర్కొన్నారు.
స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం ద్వారా రూ. 371 కోట్ల ప్రజాధనాన్ని బాబు దారిమళ్లించాడు, దోచుకున్నాడు. 2014 నుండి 2019 వరకు బాబు పాలనలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని అవినీతి ఏపీలో జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి.. యువతకు మంచి చేయాల్సిన చోటే చంద్రబాబు తప్పుడు పనులు చేశాడు. అవినీతి చేసినవాడు చంద్రబాబేలే అని చట్టం ఊరుకుంటుందా?' అని సత్యనారాయణ ప్రశ్నించారు.