చంద్రబాబేలే అని చట్టం ఊరుకుంటుందా.. నిప్పులాంటి మనిషైతే కోర్టులో తేల్చుకోవాలి : బొత్స సత్యనారాయణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. అవినీతికి పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ మేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగానే జరిగిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని.. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే సీఐడీ అరెస్ట్ చేసిందని బొత్స సత్యనారాయణ తెలిపారు. నిప్పులాంటి మనిషి అయితే కోర్టుల్లో తేల్చుకోవాలని బొత్స చురకలంటించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. అవినీతికి పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని బొత్స పేర్కొన్నారు.
'కప్పిపుచ్చలేడు. స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం ద్వారా రూ. 371 కోట్ల ప్రజాధనాన్ని బాబు దారిమళ్లించాడు, దోచుకున్నాడు. 2014 నుండి 2019 వరకు బాబు పాలనలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని అవినీతి ఏపీలో జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి.. యువతకు మంచి చేయాల్సిన చోటే చంద్రబాబు తప్పుడు పనులు చేశాడు. అవినీతి చేసినవాడు చంద్రబాబేలే అని చట్టం ఊరుకుంటుందా?' అని సత్యనారాయణ ప్రశ్నించారు.
అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ పేరుతో రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు చంద్రబాబు, హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయన్నారు. అనుభవం ఉంటే అరెస్ట్ చేయరా..? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా? కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారన్నారు.
మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజక్ట్ లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో.. ప్రభుత్వ డబ్బును మాత్రం ఖర్చు చేయించి, రూ. 371 కోట్లు చంద్రబాబు అండ్ కో మింగేశారు. ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ- ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుంది..? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు స్కామ్ చేశాడు.
ALso Read: చంద్రబాబు అరెస్ట్ : అనుభవం ఉంటే అవినీతి పరుడిని అరెస్టు చేయకూడదా?.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి, అరెస్టులు చేశాయి. సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు. వారంతా ఈ కుట్రలో పాత్రధారులు.. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారు.
షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారు. హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయి. ఆ డబ్బులు అన్ని చంద్రబాబుకు, ఆ పార్టీ వారికి చేరాయి. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే... అయన ఈ విషయం పై ఏమి మాట్లాడలేదు. అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే... చంద్రబాబు సిఐడిని నిలదీశారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటోందని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.