ఎన్‌సీసీ భూముల వ్యవహారం.. వైసీపీపై దుష్ప్రచారమే : టీడీపీ నేతలపై పోలీసులకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు
రుషికొండ భూముల వ్యవహారంపై తనపైనా, వైసీపీపైనా జరుగుతున్న ప్రచారంపై ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ ప్రతిష్టకు (ysrcp) భంగం కలిగిస్తూ రుషికొండ భూకబ్జాల పేరిట జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఫైరయ్యారు. ఈ మేరకు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈనాడు అధినేత రామోజీరావు (ramoji rao) , ఏబీఎన్ రాధాకృష్ణ (abn radha krishna) , టీవీ 5 బీఆర్ నాయుడులపై (br naidu) ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారంతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు . టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనుపై కూడా ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అక్రమార్కులపై చర్యలు తప్పవన్నారు. రెండేళ్లలో 10 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటపెడతామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. రామోజీరావు ఆర్థిక నేరగాడని.. ఫిల్మ్‌సిటీ పేరిట భూములు మింగేశారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ లీలలన్నీ ప్రజలకు తెలుసునని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రుషికొండ ఎన్‌సీసీ భూముల వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ భూముల కేటాయింపు తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబు హయాంలోనే NCC భూముల లావాదేవీలు జరిగాయని ఆయన ఆరోపించారు . తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు వేసి నిజాలు చెప్పగలరా అని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. కోట్లాది రూపాయలు తీసుకుని ఎన్.సి.సి కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆల్జీమర్స్‌తో బాధపడుతున్నారని.. దేవుడు ఆయుష్షు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేయగలుగుతారని జోస్యం చెప్పారు.
ఉత్తరాంధ్రలో బీసీల కడుపు కొట్టి భూములను చంద్రబాబు సామాజిక వర్గం ఆక్రమించిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. భూముల అక్రమాలను సహించేది లేదని.. భూములన్నీ స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సుజనా చౌదరి ఆర్ధిక నేరగాడని.. అయ్యన్నపాత్రుడు మోస్ట్ వాగుడుకాయంటూ సెటైర్లు వేశారు. ఆయన ఇంటి పేరు చింతకాయ కాదని మిరపకాయలంటూ అభివర్ణించారు. అయ్యన్న తాగితే మనిషి కాదని.. రాత్రీ, పగలు తాగుతూనే వుంటాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
అయ్యన్న, ఆయన కొడుకు విజయ్ కి బినామీ కంపెనీలు ఉన్నాయని.. తండ్రీ కొడుకులు బెంగుళూరులో మోసాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అయ్యన్న కొడుకుల మోసాలపై ఈ.డీ.కి ఫిర్యాదు చేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ ఆరోపణలు చేసిన జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీ మురళీ, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి స్నేహితుడని చెప్పారు. జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీలో తన అల్లుడికి వాటాలు ఉన్నాయనేది అసత్య ప్రచారమని విజయసాయిరెడ్డి తేల్చారు. ఈ భూముల వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేని తన అల్లుడుని, తన కుటుంబాన్ని, తనకు, తన పార్టీపై ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులను ఎండగడతానని హెచ్చరించారు.