కన్నా...! కాణిపాకం ఎప్పుడొస్తున్నావు: ట్విట్టర్‌లో విజయసాయి రెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. కాణిపాకం ఎప్పుడొస్తున్నావంటూ కన్నా లక్ష్మీనారాయణను ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా బుధవారం నాడు ప్రశ్నించారు.
అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. కాణిపాకం ఎప్పుడొస్తున్నావంటూ కన్నా లక్ష్మీనారాయణను ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా బుధవారం నాడు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్స్ కొనుగోలు విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది.
ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరకు దక్షిణ కొరియా నుండి ఈ టెస్టింగ్ కిట్స్ ను కొనుగోలు చేశారని కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డితో పాటు వైసీపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు చేశారు.
also read:విజయసాయి వ్యాఖ్యల వెనుక కుట్ర, విచారణ చేయాలి: కన్నా డిమాండ్
ఇదే సమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నుండి మాజీ కేంద్ర మంత్రి సుజాన చౌదరి ద్వారా కన్నా లక్ష్మీనారాయణ రూ. 20 కోట్లు తీసుకొన్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నావా అని కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా విజయసాయిరెడ్డి మంగళవారం నాడు విశాఖపట్టణంలో ప్రకటించారు. లాక్ డౌన్ తర్వాత కాణిపాకంలో ప్రమాణం చేసే తేదీని ప్రకటిస్తానని కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.
కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన నేపథ్యంలో బుధవారం నాడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాణిపాకం ఎప్పుడొస్తావు కన్నా అంటూ ప్రశ్నించారు.ఎన్నికల సమయంలో పంపిన నిధుల్లో రూ. 30 కోట్లు గోల్ మాల్ కావడంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తలను కూడ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.