న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అమరావతి భూముల స్కాం విషయంలో ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని రాజ్యసభలో ఆయన గురువారం నాడు ప్రస్తావించారు.

అమరావతి పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపించింది.జగన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయమై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. మరో వైపు  ఈ విషయంలో ఏసీబీ  కేసు నమోదు చేసింది.

also read:అమరావతి భూముల స్కాం: హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామన్న సజ్జల

మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు సహా 12 మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.ఈ కేసులపై దమ్మాలపాటి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. మరో వైపు టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు దాఖలు చేసిన పిటిషన్లపై కూడ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.  రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతతో న్యాయవ్యవస్థ ఉందన్నారు. ఈ ధోరణిని వెంటనే మానుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయన్నారు.

also read:బాబుకి ఊరట: అమరావతి భూముల వ్యవహారంలో సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే

అయితే ఈ సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజయసాయిరెడ్డికి అడ్డుపడ్డారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని ఆయన చెప్పారు. కోర్టు నిర్ణయాలను తప్పు పట్టేవిధంగా ఎంపీ మాట్లాడారని చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.