కృష్ణా, గుంటూరు గుంటూరు జిల్లాల్లో మున్సిపల్  ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశాఖలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ రోజు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా మోహం చాటేశారని ఆయన ధ్వజమెత్తారు.

మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజలు అంగీకరించారని.. ఈ ఫలితాలతో తేలిపోయిందని విజయసాయి స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు పాచిపనులు చేసుకునేందుకు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారని.. మరి లోకేశ్, చంద్రబాబులు హైదరాబాద్‌కు పాచిపనులు చేసుకోవడానికి వెళ్లారా అంటూ దుయ్యబట్టారు.

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే మాట కాదా అంటూ విజయసాయి ప్రశ్నించారు. పుత్రుడు, దత్తపుత్రుడు కూడా ముందుగానే ఏపీ వదిలి వెళ్లిపోయారని.. రాష్ట్రంలో ఏ ప్రతిపక్షనేత లేరని, మీడియాతో మాత్రం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Also Read:ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఉత్తరాంధ్రలో వైసీపీ క్లీన్‌స్వీప్

వీళ్లని టూరిస్ట్ నాయకులని అంటారంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఎల్లో మీడియాలో పిచ్చి డిబేట్లు పెట్టి రఘురామకృష్ణంరాజుతో మాట్లాడిస్తారని,  ఇక సబ్బంహరిని దిగ్గజ విశ్లేషకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

2019 ఎన్నికల్లో ఈవీఎంలు టెంపర్‌ చేశారంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు మరి.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజాతీర్పును అడ్డుకోవడం నిమ్మగడ్డ, చంద్రబాబుల వల్ల కాదంటూ ఆయన ధ్వజమెత్తారు.

జగన్ మరో 25 సంవత్సరాలు నిరాటంకంగా పరిపాలిస్తారని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో కొన్ని వార్డులను వైసీపీ పొగొట్టుకుందని.. ఇది అనుకోని పరిణామామని, కారణాలను విశ్లేషిస్తామని స్పష్టం చేశారు. గాజువాకలో 11, భీమిలిలో 5, పెందుర్తి 7, సౌత్‌లో 5 స్థానాలను కోల్పోయామని.. ఇది వైసీపీకి ఒక గుణపాఠం లాంటిదని చెప్పారు.