ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మాన్సాస్ ట్రస్ట్ పాలకమండలిని త్వరలోనే నియమిస్తామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సింహాచలం భూముల సమస్యపైనా కోర్టులో పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

త్వరలోనే మాన్సాస్‌ ట్రస్టు (mansas trust) పాలకమండలిని నియమిస్తామని వైసీపీ (ysrcp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) తెలిపారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారు. సింహాచలం భూసమస్య కోర్టు పరిధిలో ఉందన్నారు. త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. దేవస్థానానికి ప్రత్యామ్నాయ స్థలం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. పంచ గ్రామాల సమస్య కోర్టులో ఉందని... త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతకుముందు సింహాచలం దేవస్థానం (simhachalam temple) అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు (ashok gajapathi raju) లేకుండానే గురువారం కొత్త ట్రస్టు బోర్డు సభ్యుల (trust board members) ప్రమాణ స్వీకారం జరిగింది. ట్రస్ట్ బోర్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈవో ఎం సూర్య కళ. సింహాచల దేవస్థానంలో ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ గా అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తారు. అలాగే 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించింది. వీరిలో 13 మంది ట్రస్టు సభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరవ్వగా.. దినేష్ రాజు గైర్హాజరయ్యారు. ఏడుగురు మహిళలకు సభ్యులుగా పాలకమండలిలో అవకాశం కల్పించారు. అలాగే మరో నలుగురికి ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు కల్పించారు. వీరు వరలక్ష్మి, శేష రత్నం, నరసింహా మూర్తి, చంద్రమౌళిగా తెలిపారు. 

కాగా.. విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గాన్ని నియమించింది ఏపీ ప్రభుత్వం (ap govt) . రెండేళ్ల కాలపరిమితితో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాడి పద్మ, వంకాయల సాయినిర్మల, శ్రీదేవివర్మ పెన్మత్స, సువ్వాడ శ్రీదేవి, దశమంతుల రామలక్ష్మి, ఎం.రాజేశ్వరి, సంపంగి శ్రీనివాసరావు, పిల్లా కృష్ణమూర్తిపాత్రుడు, కె.నాగేశ్వరరావు, బయ్యవరపు రాధ, దొడ్డి రమణ, గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్ రాజ్‌, ఆర్‌. వీర వెంకట సతీష్‌‌లను ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా నియమించారు. వీరిలో దొడ్డి రమణ గాజువాక ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయారు. అలాగే దినేష్ రాజ్ మార్చితో ముగిసిన గత పాలకవర్గంలోనూ సభ్యుడిగా ఉన్నారు.. ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది ప్రభుత్వం. 

2020లో సింహాచల ఆలయ ఛైర్‌పర్సన్‌గా దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత (sanchaita) గజపతిరాజుతో పాటు, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ఛైర్మన్‌గా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఛైర్మన్‌ను నియమించిందని.. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్ర‌స్టు కాబట్టి వ‌య‌సులో పెద్ద‌వారు ట్ర‌స్టీగా ఉండాల‌ని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. సంచయిత నియామకాన్ని రద్దుచేసింది. ఆ తర్వాత అశోక్ గజపతి రాజు.. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరించారు.