Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎంపీ నుండి ప్రాణహాని... సొంత వదిన కలెక్టర్ కు ఫిర్యాదు

వైసిపి ఎంపీ వంగా గీత సొంత సోదరుడి ఆస్తిని కాజేసి తమకు అన్యాయం చేస్తున్నారని వదిన కళావతి ఆరోపిస్తున్నారు. 

YSRCP MP Vanga Geetha brother wife Sensational allegations AKP
Author
First Published Jun 6, 2023, 11:52 AM IST

కాకినాడ : అధికార వైసిపి ఎంపీ నుండి ప్రాణహాని వుందని సొంత వదినే ఆందోళనకు దిగింది. పుట్టింటి ఆస్తిని కాజేయాలని ఆడపడుచు, కాకినాడ ఎంపీ వంగా గీత ప్రయత్నిస్తున్నారని వదిన పుప్పాల కళావతి ఆరోపించారు. వారసత్వంగా తమకు దక్కాల్సిన ఆస్తికోసం న్యాయపోరాటం చేస్తుంటే ఎంపీ బెదిరిస్తున్నారని... కుటుంబసభ్యులకు ప్రాణహాని కలిగిస్తారేమోనని భయంభయంగా బ్రతుకుతున్నామని అన్నారు. తమకు రక్షణ కల్పించి న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ గీత వదిన కళావతి కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను వేడుకున్నారు.  

ఎంపీ గీత వదిన కళావతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు కాకినాడలో ఎంపీ గీత సోదరుడు కృష్ణకుమార్ కు వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులు వున్నాయి. అయితే ఎంపీ గీతకు పుట్టింటి ఆస్తిపై కన్ను పడిందని... సోదరున్ని బెదిరించి బలవంతంగా ఆస్తులు రాయించుకుందని వదిన కళావతి ఆరోపిస్తున్నారు. తన భర్త కృష్ణకుమార్ 2010లో చనిపోవడంతో ఈ ఆస్తుల విషయంలో వివాదం మొదలయ్యిందని కళావతి తెలిపారు. 

Read More  తాత ఆపరేషన్ కు అత్త డబ్బులు పంపితే.. ఆన్ లైన్ గేమ్స్ లో పోగొట్టి.. యువకుడు ఆత్మహత్య...

తమకు రావాల్సిన ఆరు ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, కాకినాడలోని 600గజాల ఇంటిని ఆడపడుచైన ఎంపీ గీత ఆక్రమించుకున్నారని కళావతి కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. తమ ఆస్తి కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడానికి సిద్దపడగా ఎంపీ గీతతో పాటు మరో ఆడపడుచు కుసుమకుమారి బెదిరిస్తున్నారని వారి వదిన కళావతి ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంపీ గీతపై ఫిర్యాదు చేసినా లాభం లేదని కళావతి పేర్కొన్నారు. 

ఎంపీ గీత భర్త విశ్వనాథ్, మరో ఆడపడుచు భర్త రవికుమార్ కలిసి తన కుటుంబాన్ని చంపాలని చూస్తున్నారని కళావతి ఆరోపించారు. ఈ భయంతో తన కొడుకు గత రెండు నెలలుగా ఇంటికి రాకుండా అజ్ఞాతంలో వుంటున్నాడని అన్నారు. ఆడపడుచులు వంగా గీత, కుసుమకుమారి నుండి తమకు రక్షణ కల్పించాలని... తమ ఆస్తులు తమకు దక్కేలా చూడాలంటూ స్పందన కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు కళావతి. అనంతరం కలెక్టరేట్ వద్ద ప్లకార్డు ప్రదర్శిస్తూ ఆమె నిరసన చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios