రాజీనామాల ఇష్యూ: బాబుపై నెట్టేసిన వైసీపీ

Ysrcp MP's resignations issue: War words between tdp and Ysrcp
Highlights

ఎంపీల రాజీనామాలు: టిడిపి, వైసీపీ మధ్య మాటల యుద్ధం

అమరావతి:  వైసీపీ ఎంపీల రాజీనామాల అంశం ప్రస్తుతం  ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. అధికార, విపక్ష పార్టీల మధ్య రాజీనామాల అంశం విమర్శలు, ప్రతి విమర్శలకు  దారితీసింది. ఎన్నికలు రావనే ఉద్దేశ్యంతోనే వైసీపీ రాజీనామాల డ్రామాలు ఆడుతోందని చంద్రబాబునాయుడు ఆరోపిస్తోంటే, తమ రాజీనామాలు ఆమోదించకపోవడానికి బాబే కారణమని  వైసీపీ ప్రత్యారోపణలకు దిగింది.


ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామని వైసీపీ గతంలో ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా తమ రాజీనామాల లేఖలను  లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీలు అందించారు.అయితే ఈ రాజీనామాలను ఇంకా ఆమోదం పొందలేదు. ఈ రాజీనామాలపై చర్చించేందుకుగాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్  జూన్ 6వ  తేదిన వైసీపీ ఎంపీలతో సమావేశం కానున్నారు.


అయితే ఏడాది సమయం ఉంటే ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించరు. ఇప్పటికే వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించి  ఎన్నికల సంఘానికి పంపించి ఉంటే  ఎన్నికలు వచ్చేవి. కానీ, ఈ రాజీనామాలుఆమోదం పొందాలి. ఎన్నికల సంఘానికి పంపాలి. అయితే ఈ తతంగం పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో  వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందినా కానీ   ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.


ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేనందునే వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే  రాజీనామాలు చేసినట్టుగా నటిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో వైసీపీ తీరును ఎండగడుతున్నారు. నవ నిర్మాణ దీక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో  వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాలపై బాబు విమర్శలు గుప్పిస్తున్నారు.

 మరో వైపు వైసీపీ ఎంపీలు కూడ  టిడిపి విమర్శలపై ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబునాయుడు ఒత్తిడి కారణంగానే తమ రాజీనామాలను ఆమోదించలేదని వైసీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ విషయమై మంగళవారం నాడు బాబుపై ఆరోపణలు చేశారు.రాజీనామాలకు కట్టుబడిఉన్నామని ఆయన చెప్పారు. రాజీనామాలు ఆమోదించకపోవడానికి బాబే కారణమన్నారు.


అయితే ఈ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. అమలాపురం లో మంగళవారం నాడు జరిగిన నవ నిర్మాణ దీక్ష సభలో బాబు ఈ అంశంపై స్పందించారు. తాను చెబితేనే వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ పెండింగ్ లో ఉంచారని వైసీపీ ఎంపీలు చేస్తున్నఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను చెబితే కేంద్రం విన్నట్టుగా ఉంటే ప్రత్యేక హోదానే తెచ్చుకోనేవాడినని బాబు చెప్పారు. వైసీపీ ఎంపీలు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.


 

   

loader