బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నందిగం సురేశ్‌ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓం బిర్లాకు ఇచ్చిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

తనను సురేశ్ అసభ్యపదజాలంతో దూషించారని నర్సాపురం ఎంపీ ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను స్పీకర్‌కు అందజేశారు.

బుధవారం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన నందిగం సురేశ్.. ఎంపీ రఘురామకృష్ణం రాజుపై మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి జగన్ గురించి పిచ్చివాగుడు వాగితే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతామని హెచ్చరించారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సురేశ్ వార్నింగ్ ఇచ్చారు. మిథున్ రెడ్డికి నాలుగు ఓట్లు రావని రఘురామ కృష్ణం రాజు అంటున్నారని.. ఢిల్లీలో గలీజు పనులు, మోసగాడు, చీటర్ లాంటి పదవులకు పోటీ పడితే ఆయనకే ఎంపీ ఓట్లన్నీ పడతాయని సురేశ్ ఎద్దేవా చేశారు.