ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న నేరాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. అదృష్టం బాగుండి పోలీసుల కస్టడీ నుంచి తాను ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ఆయన వ్యాఖ్యానించారు. లేని చ‌ట్టాల గురించి త‌మ‌ పార్టీ నేత‌లు మాట్లాడతారంటూ రఘురామ చురకలు వేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వరుసపెట్టి జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishna raju) మండిపడ్డారు. మంగ‌ళ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో 3 హ‌త్య‌లు, 6 మాన‌భంగాలు అని చెబుతుంటే బాధేస్తోంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. లేని చ‌ట్టాల గురించి త‌మ‌ పార్టీ నేత‌లు మాట్లాడతారంటూ రఘురామ చురకలు వేశారు. ఏపీలో ఎక్కువ నేరాలు జ‌రుగుతున్నాయ‌ని క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (national crime records bureau) వెల్ల‌డిస్తోంద‌ని ఆయన దుయ్యబట్టారు. 

మ‌హిళ‌లపై నేరాల్లో 2020లో ఏపీ 8 వ స్థానంలో ఉంద‌న్న ర‌ఘురామ‌.. ప‌ని ప్ర‌దేశాల్లో లైంగిక వేదింపుల ఘ‌ట‌న‌ల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే మ‌హిళ‌ల‌పై భౌతిక దాడుల్లో మొద‌టి స్థానంలో ఉందని ... 2019తో పోలిస్తే.. రాష్ట్రంలో 63 శాతం మేర నేరాలు పెరిగాయ‌ని రఘురామ కృష్ణంరాజు వివరించారు. ప్ర‌తి 3 గంట‌ల‌కు ఎస్సీల‌పై ఓ దాడి జ‌రుగుతోంద‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో అత్య‌ధిక లాకప్ డెత్‌లు ఏపీలోనే న‌మోద‌య్యాయని, త‌న అదృష్టం బాగుండి పోలీసుల కస్టడీ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ంటూ వ్యాఖ్యానించారు. శాంతి భ‌ద్ర‌త‌లు క‌ల్పించ‌లేని ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ‌మే కాదని జగన్ (ys jagan) పాలనపై రఘురామ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే.. ఇటీవల రేపల్లె రైల్వే స్టేషన్‌లో (repalle railway station) సామూహిక అత్యాచారాకి (gang rape) గురైన బాధితురాలికి ప్రస్తుతం ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పరామర్శరకు వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత (taneti vanitha) కాన్వాయ్‌ను అడ్డుకున్న తెలుగుదేశం (telugu desam party) మహిళా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సంతనూతలపాడు నియోజకవర్గ వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కొమ్మూరి సుధాకర్‌ మాదిగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.

హోంమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారని.. 17 మంది మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu naidu) ఖండించారు. నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనం అని విమర్శించారు. మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం అని ఫైర్ అయ్యారు. మహిళలకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్ వద్ద నినాదాలు చేయడం నేరమా అని ప్రశ్నించారు. మహిళలు నినాదాలు చేయడం నేరం అన్నట్టు వారిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గళమొత్తిన గొంతులను ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఇంతకంటే గొప్పగా స్పందిస్తారని ఆశించడం తప్పేనేమో అని ఎద్దేవా చేశారు. ఒంగోలులో మహిళలపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న మహిళలను విడుదల చేయాలన్నారు.