తాడేపల్లికి చేరుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్: వైఎస్ జగన్ తో భేటీ
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇవాళ ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.
అమరావతి: వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారంనాడు ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ నుండి పిలుపు రావడంతో ఆయన తాడేపల్లికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు.
రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలను సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. రామచంద్రాపురం మున్సిపల్ వైఎస్ చైర్ పర్సన్ పై దాడితో ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను పిల్లి సుభాష్ చంద్రబోస్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు.
రామచంద్రాపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి చెల్లుబోయిన వేణుతో సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ లో ఆరా తీశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గంపై చెల్లుబోయిన వేణు ఫిర్యాదు చేశారు.
రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిణామాలపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తాడేపల్లికి రావాలని పిలిపించారు. రామచంద్రాపురంలో ఏం జరుగుతుందనే విషయమై సీఎం జగన్ ఆరా తీయనున్నారు.
also read:మంత్రితో వైరం: జగన్ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పిలుపు
రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో తన కొడుకు పిల్లి సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని ఎంపీ సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు. అయితే రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పోటీ చేస్తారని ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రకటించడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తితో ఉన్నారు.