పవన్ తీరు వీధి రౌడీలా వుండేదని.. ఓ అసాంఘిక శక్తిలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర ఫెయిల్ కావడంతో పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయయాత్రపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్ . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పనికిమాలినోళ్లకు పవన్ పెద్ద పాలేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్ర ఫెయిల్ కావడంతో పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. జగన్‌ను చూసి అంతా భయపడుతున్నారని నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. గతంలోనూ పవన్ తీరు వీధి రౌడీలా వుండేదని.. ఓ అసాంఘిక శక్తిలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన చేస్తున్న బానిసత్వానికి అలసట లేదని నందిగం సురేష్ దుయ్యబట్టారు.
పవన్ బెదిరింపులకు భయపడేది లేదని.. ఆయన తన భాష మార్చుకోవాలని ఎంపీ హెచ్చరించారు. ప్రత్యర్ధులను ఊగిపోతూ తిడుతున్నారని.. జగన్‌ను ఎదుర్కోవడానికి వంద తలలు పెట్టుకుని వస్తున్నారని విపక్ష నేతలపై నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. లోకేష్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. అమరావతిని రియల్ ఎస్టేట్ కోసమే మొదలుపెట్టారని నందిగం సురేష్ హెచ్చరించారు. ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని.. రాజధాని పేరుతో బలవంతంగా భూములు లాక్కొన్నారని ఆయన ఆరోపించారు. అమరావతి రైతులను చంద్రబాబు నాశనం చేశారని.. అన్నదాతలు నాశనం కావాలని టీడీపీ నేతలే కోరుకుంటున్నారని నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
