అరెస్ట్ చేస్తే పదిమంది రోడ్లపైకి రాలేదు .. మంచి చేస్తేనే జన నీరాజనాలు : చంద్రబాబుపై మోపిదేవి విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీసీ సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ . నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు 100 మంది కూడా లేరని.. ఆయన కోసం రోడ్లపైకి పట్టుమని పదిమంది రాలేదని చురకలంటించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీసీ సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి చేసే వాళ్లకు ప్రజలు నీరాజనాలు పలుకుతారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో జనాలు రోడ్లపైకొచ్చి అడ్డుపడతారని ఆయన భావించారని మోపిదేవి దుయ్యబట్టారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు 100 మంది కూడా లేరని.. ఆయన కోసం రోడ్లపైకి పట్టుమని పదిమంది రాలేదని చురకలంటించారు. చంద్రబాబు అరెస్టును రాజకీయంగా సానుభూతి కోసం వాడుకోవాలని చూశారని వెంకట రమణ ఆరోపించారు.
ప్రజల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పటివరకు చంద్రబాబు రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళారని మోపిదేవి పేర్కొన్నారు. ఫైలుపై చంద్రబాబు 13 సంతకాలు చేశారని, ఆయన కొడుకు లోకేష్ అకౌంట్లోకి కూడా అమౌంట్ వెళ్ళిందని వెంకట రమణ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.
Also Read: చంద్రబాబును కుటుంబమే బట్టలూడదీసి బజార్లో నిలబెడుతోంది..: సజ్జల రామకృష్ణారెడ్డి
మరోవైపు.. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణుల ఆందోళనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు అనేక పనుల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని.. అందువల్లే ఆయనను దర్యాప్తు సంస్థ సిఐడి అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబుపై ఎవరికీ రాజకీయ కక్ష లేదని... అక్రమంగా ఇరికించలేదని అన్నారు. చంద్రబాబు ను ఆయన కుటుంబసభ్యులే బట్టలిప్పి బయట నిలబెడుతున్నారని సజ్జల అన్నారు.
అయితే చంద్రబాబును కక్షతోనే అరెస్ట్ చేసారని... జైల్లో వున్న ఆయనతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని టిడిపి ప్రచారం చేస్తోందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబం, టీడీపీ కాస్త సక్సెస్ అయినట్లు కనిపిస్తోందని సజ్జల అన్నారు. సంపాదించడం కోసమే సీఎం అయినట్లు చంద్రబాబు వ్యవహరించారని... చివరకు టిడిపి అధినేతగా కూడా కుంభకోణాలకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడు ఆయన అవినీతి బాగోతాన్ని బయటపెడుతుంటే దానిపై చర్చ లేకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని సజ్జల అన్నారు.