న్యూఢిల్లీ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి మరో జాక్ పాట్ కొట్టేశారు. మిథున్ రెడ్డిని లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్ సభ కార్యకలాపాలను నిర్వహిస్తారు.  

మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. వైయస్ జగన్ కు మిథున్ రెడ్డిని కుడి భుజం అంటూ వైసీపీలో ప్రచారం. 

ఇకపోతే మిథున్ రెడ్డి 2014 ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మాజీకేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధీశ్వరని ఓడించి రికార్డు సృష్టించారు మిథున్ రెడ్డి. 

2019 ఎన్నికల్లో మళ్లీ రాజంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. వరుసగా రెండోసారి కూడా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.