Asianet News TeluguAsianet News Telugu

జగన్ తేల్చి చెప్పేశారా .. టీడీపీ వైపు మాగుంట చూపు, ఆసక్తికరంగా ఒంగోలు రాజకీయం..?

ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ వ్యవహారంలో గత కొద్దిరోజులుగా పలు ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ ఊహాగానాల మధ్య అసలు మాగుంటకు టికెట్ వుంటుందా లేదా అన్న టెన్షన్ ఆయన మద్ధతుదారుల్లో నెలకొంది. ఒకవేళ టికెట్ లభించని పక్షంలో శ్రీనివాసులురెడ్డి వైసీపీని వీడుతారా అన్న అనుమానాలు లేకపోలేదు.

ysrcp mp magunta sreenivasulu reddy ready to join in tdp ksp
Author
First Published Jan 17, 2024, 3:25 PM IST

వచ్చే ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఖరారు అంశం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తూ వెళ్తున్న సీఎం జగన్. మరో మాట లేకుండా నో చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని గంపెడాశలు పెట్టుకున్న నేతలు.. అధినేత నిర్ణయంతో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో కొందరు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు వేరే పార్టీల్లో చేరగా.. మరికొందరు అదే దారిలో వున్నారు. ఇలాంటి వారిలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒకరు. 

ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ వ్యవహారంలో గత కొద్దిరోజులుగా పలు ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడి నుంచి వైవీ విక్రాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మద్ధిశెట్టి వేణుగోపాల్‌లలో ఎవరో ఒకరిని బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోందట. మరోవైపు మాగుంటకు గనుక టికెట్ నిరాకరిస్తే తాను కూడా పోటీ చేయనని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. హైకమాండ్‌పై అసంతృప్తితో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. శ్రీనివాస్ రెడ్డికి టికెట్ లేదన్నట్లుగా అధిష్టానం వ్యవహరిస్తూ వుండటంతో గత కొద్దిరోజులుగా ఆయన ఇంటికి నేతలు, కార్యకర్తల రాకపోకలు ఎక్కువయ్యాయి. 

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబులు మాగుంటను కలిశారు. ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో ప్రస్తుతానికి తాను ఎలాంటి సమాచారం లేదని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలియదని శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. ఈ ఊహాగానాల మధ్య అసలు మాగుంటకు టికెట్ వుంటుందా లేదా అన్న టెన్షన్ ఆయన మద్ధతుదారుల్లో నెలకొంది. ఒకవేళ టికెట్ లభించని పక్షంలో శ్రీనివాసులురెడ్డి వైసీపీని వీడుతారా అన్న అనుమానాలు లేకపోలేదు.

వివాదరహితుడిగా పేరుండటంతో పాటు అంగబలం, అర్ధబలం దండి వున్న మాగుంట ఫ్యామిలీకి అన్ని పార్టీల్లోనూ పరపతి వుంది. ఆయన వస్తానంటే రెడ్ కార్పెట్ స్వాగతాలు ఖాయం. ఈ క్రమంలోనే శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అంతేకాదు.. మాగుంట కొడుకు రాఘవరెడ్డి కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసులు రెడ్డికి ఎప్పటిలాగే ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే.. ఆయన కొడుకుకి కావలి టికెట్ కేటాయిస్తారనే టాక్ వుంది.

వాస్తవానికి మాగుంట శ్రీనివాసులురెడ్డిది నెల్లూరు జిల్లాయే. వాళ్ల వ్యాపారాలు, బంధుత్వాలు, ఆస్తులు, అనుచరగణం కూడా నెల్లూరులో వుంది. ఒంగోలు వరకు మాగుంటకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురుకానప్పటికీ, కావలిలో మాత్రం రాఘవరెడ్డి రాకను తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకించే అవకాశం వుంది. అయితే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే వారు తప్పక పనిచేయాల్సిందే. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే ముందు మాగుంట ఫ్యామిలీ విషయంలో జగన్ నిర్ణయం ఏంటనేది తెలియాల్సి వుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios