తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించారు. అయితే వాటికి సీఎం జగన్ గతంలో చేసిన ట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. ‘‘టీడీపీ నేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే దీనిపై ఓ నెటిజన్ ‘‘ఇందుకు మీ బాస్ పర్మిషన్ ఇచ్చారా?’’ అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును ప్రశ్నించారు. మరో నెటిజన్.. ‘‘టీడీపీ ఎంపీ టిక్కెట్ కోసం ఈ ప్రయత్నం కదా’’ అని ప్రశ్నను సంధించారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. గతేడాది చంద్రబాబుకు సీఎం జగన్ బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు.
ఇదిలా ఉంటే.. గతంలో టీడీపీ ఎంపీలతో కలిసి వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఉన్న ఫొటో బయటకు రావడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా సాగింది.
