వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు నంద్యాల జిల్లాలోని ఆయన స్వగృహం నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. భగీరథ రెడ్డికి చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన బంధువులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
చల్లా భగీరథ రెడ్డి దరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. ఆయన తండ్రి చల్లా రామకృష్ణా రెడ్డి.. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోవెలకుంట్ల స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన భగీరథరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత చల్లా కుటుంబం.. టీడీపీలో చేరింది. అయితే 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు చల్లా కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. చల్లా రామకృష్ణా రెడ్డికి వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే రామకృష్ణా రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానానికి భగీరథ రెడ్డిని వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం జగన్ ఖరారు చేశారు. దీంతో భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.
