Asianet News TeluguAsianet News Telugu

ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు.. రాజకీయ వేదికపైకి వచ్చారనే వివాదం: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. 

YSRCP MLA Vasantha Krishna prasad Says vuyyuru Srinivas is good person
Author
First Published Jan 4, 2023, 9:27 AM IST

గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం మంచి పద్దతి కాదని అన్నారు. కొంత మంది  ఎన్నారైలను వారి పనులు వారు చూసుకోవాలని సలహా ఇస్తున్నారనీ.. ఎన్నారైలను భయపడితే ఎలా అని ప్రశ్నించారు. ఇలాగైతే వారు సేవా కార్యక్రమాలు ఎలా చేస్తారని అన్నారు. ప్రవాసాంధ్రుల వల్ల దేశానికి మంచి జరుగుతుందని  అన్నారు. ఏదేదో మాట్లాడి ఎన్నారైలు చేసే సాయాన్ని ఆపాలని అనుకోవడం అవివేకం అవుతుందని అన్నారు. 

ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మన్ ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామని..  ఆయన పేదలకు ఎన్నో విధాలుగా సాయం చేశారని చెప్పారు. గుంటూరులో రాజకీయ వేదికపైకి వచ్చారనే ఆయనపై వివాదాలు ముసురుకున్నాయని అన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ మంచి మనిషి అని అన్నారు. గతంలో అనేక మంది నాయకులు సేవ కార్యక్రమాల పేరుతో దుస్తులు పంపిణీ చేశారని అన్నారు. పేదల మీద అభిమానం పెద్దఎత్తున కార్యక్రమం చేయబోయి ఉయ్యూరు శ్రీనివాస్ అవస్థల పాలయ్యారని అన్నారు.  ప్రజలకు నష్టం కలిగించాలని ఉయ్యూరు శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని తాను అనుకోవడంలేదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. 

అయితే గుంటూరు తొక్కిసలాట ఘటనపై టీడీపీపై, నిర్వాహకులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు భిన్నంగా వసంత కృష్ణ ప్రసాద్ కామెంట్స్ ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఇక, ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు సభలో ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే.. తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక్కరు ఘటన స్థలంలో మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పలువురు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు బుధవారం ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఈ ఘటనలో మృతిచెందిన రమాదేవి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విజయవాడలో శ్రీనివాస్‌ను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం గుంటూరు తరలించారు. అక్కడ విచారించిన అనంతరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత్రి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అయితే శ్రీనివాస్‌ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. రూ. 25 వేల వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పోలీసుల విచారణకు శ్రీనివాస్‌సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. కాగా, ముగ్గురు మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios