వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన  కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఓటు కోసం తనకు కూడా ఆఫర్ వచ్చిందని చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఓటు కోసం తనకు కూడా ఆఫర్ వచ్చిందని చెప్పారు. పోలింగ్ ముందు రోజు తన కొడుకుకు ఫోన్ చేశారని.. తాను ఒప్పుకోనని అతడు ఆఫర్‌ను తిరస్కరించారని తెలిపారు. పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లిలోని తన నివాసానికి కొందరు వచ్చి.. తనతో పర్సనల్‌గా మాట్లాడాలని గన్‌మెన్‌ను సంప్రదించారని చెప్పారు. గన్‌మెన్‌ తనతో వారిని ఫోన్‌లో మాట్లాడిస్తే.. పర్సనల్‌గా మాట్లాడాలని అన్నారని తెలిపారు. అయితే ఈ సమయంలో ఎందుకు రేపు ఉదయం రమ్మని వారిని పంపించానని చెప్పారు. 

మరుసటి రోజు ఉదయం.. పోలింగ్ ముందు వాళ్లు తనకు ఫోన్ చేశారని చెప్పారు. తన పక్కనే ఉన్న ఎమ్మెల్యే చక్రపాణి ముందు స్పీకర్ పెట్టి మాట్లాడానని తెలిపారు. పర్సనల్‌గా మాట్లాడాలంటే వాళ్ల ఆటలన్నీ తెలుసునని చెప్పానని అన్నారు. తనకు అలాంటి ఆలోచన లేకపోవడంతో.. తాను కూడా ఇష్యూ చేయదలుచేకోలేదని అన్నారు. రూ. 200 కోట్లు ఒక వైపు.. జగన్ ఫొటో మరోవైపు ఉంటే తాను జగన్ ఫొటోనే తీసుకుంటానని చెప్పారు. 

వీడియో

ఇదిలా ఉంటే.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్తో తమ ఎమ్మెల్యేల్లో కొందరిని టీడీపీ ప్రలోభాలకు గురిచేసిందని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై నలుగురు ఎమ్మెల్యేలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందని.. టీడీపీ పది కోట్లు ఆఫర్ చేసిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (జనసేన రెబల్ ఎమ్మెల్యే) ఆరోపించారు. తన ఓటు అమ్మితే రూ.10 కోట్లు వచ్చేదని.. తన దగ్గర డబ్బు ఎక్కువై వద్దనలేదన్నారు. తన ఓటు కోసం తన మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారని ఆరోపణలు చేశారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేయమన్నారని.. తెలుగుదేశానికి ఓటేస్తే మంచి పొజిషన్ వుంటుందని చెప్పారని రాపాక చెప్పుకొచ్చారు. 

 సీఎం జగన్‌ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని.. సిగ్గు శరం వదిలేస్తే తనకు పదికోట్లు వచ్చి వుండేవని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో వుండలేమని ఆయన పేర్కొన్నారు. అయితే తనపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్పందించారు. రాపాక వరప్రసాద్ ఆరోపణలను మంతెన రామరాజు తోసిపుచ్చారు. 

ఇక, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ తనను సంప్రదించిందని అన్నారు. టీడీపీ నేతలు వారం రోజలు తమను సంప్రందించిన మాట నిజమని అన్నారు. స్వయంగా తనను కలిశారని చెప్పారు. తాను ఒప్పుకుంటే వాళ్లతో, వీళ్లతో మాట్లాడిస్తామని చెప్పారని తెలిపారు. స్వయంగా ఆ పార్టీలోని పెద్దలు తనకు ఫోన్ చేశారని.. అయితే తాను ఫోన్ కూడా ఎత్తలేదని అన్నారు. కావాలంటే తన కాల్ డేటా చూడాలంటూ మీడియాకు చూపించారు. పేపర్‌ను మీడియా ముందుపెట్టిన మద్దాలి గిరి.. ఈ నెంబర్ ఎవరిదో చూస్తే మీకే అర్థమవుతుందని అన్నారు. టీడీపీ సంప్రదించిన వారికి వత్తాసు పలికే పరిస్థితి లేదని చెప్పారు.