అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేని చంద్రబాబు తన పాలన గొప్పగా ఉనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయిపోయిన పెళ్లికి బ్యాండ్ బాజా అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

బడుగుబలహీన వర్గాల పాలన జగన్మోహన్ రెడ్డిదన్న ఆయన.. చంద్రబాబుది విధ్వసకరమైన పాలనగా అభివర్ణించారు. పంచభూతాలను చంద్రబాబు తో సహా టీడీపీ నేతలు దోచుకున్నారని.. అమరావతి నుంచి ఢిల్లీ వరకు హవాలా స్కాం చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

Also Read:ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ భూమా అఖిలప్రియ:తండ్రికి కుడి భుజం, కూతురితో వైరం

మహిళా ఎమ్మార్వోను ఇసుకలో తొక్కి చంపబోయారని.. రాజధాని పేరుతో అమరావతిలో వేల కోట్లు కాజేశారని  ఆయన విమర్శించారు. 14 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉన్నా అర్హులకు ప్రభుత్వం పథకాలు అందలేదని... ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన టీడీపీ అధినేతకు లేదని దుయ్యబట్టారు.

అమ్మఒడి, రైతు భరోసా వంటి చారిత్రాత్మక పథకాలు సీఎం జగన్ అమలు చేశారని శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం జగన్ అమలు చేశారని కొనియాడారు.

చంద్రబాబు కళ్ళు బైర్లుకమ్మి మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు మహిళల మానాలతో ఆడుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో తల్లలు, రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తోందని.. సంక్షేమ కార్యక్రమాలు అమలుపై కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తో బహిరంగ చర్చకు మేము సిద్ధమని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Also Read:పచ్చగా కనపడితే చాలు, కెలికి మరీ తిట్టించుకుంటాడు.. విజయసాయి రెడ్డి

బహిరంగ చర్చ కుప్పం నియోజకవర్గం నుంచి మొదలు పెడదామని, చంద్రబాబు రావడానికి ఇష్టం లేకపోతే లోకేష్ ను బహిరంగ చర్చకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందాయి సీఎం జగన్ పాలనలో ఎలా అందాయో చర్చిద్దామన్నారు.

ప్రజలకు తమ మేనిఫెస్టో పంపుతామని... ఎన్ని హామీలు అమలు చేశామో ప్రజలను టిక్కు పెట్టమని అడుగుతామని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. వైస్సార్సీపీ మేనిఫెస్టోను టీడీపీ నేతలు ఇంటిఇంటికీ తీసుకెళ్లి ఎన్ని హామీలు అమలు చేశామో అడగాలని ఆయన సవాల్ విసిరారు.