Asianet News TeluguAsianet News Telugu

ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ భూమా అఖిలప్రియ:తండ్రికి కుడి భుజం, కూతురితో వైరం

మాజీ మంత్రి భూమా  అఖిలప్రియ, మాజీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మెన్ ఏవీ సుబ్బారెడ్డిల మధ్య అగాధం మరింత పెరిగిపోయింది. తనను హత్య చేయించేందుకు సూడో నక్సలైట్ సంజూకు అఖిలప్రియ దంపతులు సుఫారీ ఇచ్చారని, వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు

war words between bhuma akhila priya and av subba reddy
Author
Kurnool, First Published Jun 5, 2020, 3:55 PM IST

కర్నూల్: మాజీ మంత్రి భూమా  అఖిలప్రియ, మాజీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మెన్ ఏవీ సుబ్బారెడ్డిల మధ్య అగాధం మరింత పెరిగిపోయింది. తనను హత్య చేయించేందుకు సూడో నక్సలైట్ సంజూకు అఖిలప్రియ దంపతులు సుఫారీ ఇచ్చారని వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తండ్రికి అత్యంత సన్నిహితుడైతే కూతురికి మాత్రం బద్ద శతృవుగా మారాడు ఏవీ సుబ్బారెడ్డి.

also read:వ్యక్తిగతంగా గ్యాప్, ఆళ్లగడ్డలో రాజకీయం చేస్తే స్వాగతిస్తా:ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియ కౌంటర్

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి భూమా అఖిలప్రియకు మధ్య కొంత కాలంగా గ్యాప్ పెరిగింది. రోజు రోజుకు ఈ గ్యాప్ పెరుగుతూనే వస్తోంది. 

war words between bhuma akhila priya and av subba reddy

ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుండెపోటుతో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించాడు.భూమా నాగిరెడ్డి మరణంతో అఖిలప్రియకు చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించాడు.

అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుండి ఏవీ సుబ్బారెడ్డితో గ్యాప్ వచ్చిందని చెబుతారు. తనను ఉద్దేశ్యపూర్వకంగానే భూమా అఖిలప్రియ పక్కన పెడుతున్నారని ఏవీ సుబ్బారెడ్డి అప్పట్లో పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు.

ఆ తర్వాతి కాలంలో కూడ ఈ గ్యాప్ మరింత పెరుగుతూ వచ్చింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఆయనపై రాళ్ల దాడికి దిగారు. మంత్రి భూమా అఖిలప్రియ వర్గీయులే తనపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. ఏవీ సుబ్బారెడ్డి వర్గానికి చెందిన సుబ్బారెడ్డి 2018 ఏప్రిల్ మాసంలో ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏవీ సుబ్బారెడ్డిని, అఖిలప్రియను పిలిపించి మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం ఇద్దరూ పనిచేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కొంత కాలం పాటు బహిరంగంగా ఇద్దరు విమర్శలు చేసుకోలేదు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 

2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల సమయంలో కూడ టీడీపీ టిక్కెట్టు కోసం చివరి నిమిషం వరకు ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఏదో ఒక్క టిక్కెట్టు ఇవ్వాలని ఆయన కోరారు. చివరకు నంద్యాల టిక్కెట్టు కోసం ఆయన పట్టుబట్టారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డికే బాబు టిక్కెట్టు కేటాయించారు.  

టిక్కెట్టు కేటాయించకపోయినా కూడ ఏవీ సుబ్బారెడ్డి టీడీపీలోనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా వెనుక మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు ఉన్నారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ సూడో నక్సలైట్ సంజూకు రూ. 50 లక్షలు సుఫారీ ఇచ్చాడని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు.ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై అఖిలప్రియ స్పందించారు. ఆళ్లగడ్డలో రాజకీయం చేయాలన్నారు. తన భర్తకు నోటీసులు రావడంతో హైకోర్టును ఆశ్రయించినట్టుగా చెప్పారు. ఈ కేసులో తన పేరు లేదని ఆమె వివరించారు.

చిన్నతనంలో తన ఇంట్లోనే భూమా అఖిలప్రియ పెరిగిన విషయాన్ని ఏవీ సుబ్బారెడ్డి గుర్తు చేస్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డితో గ్యాప్ వచ్చిన విషయాన్ని కూడ అఖిలప్రియ ఒప్పుకొన్నారు.

ఒకప్పుడు ఒకే కుటుంబంగా ఉన్న వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్ర స్థాయికి చేరుకొన్నాయి. నాగిరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్న సుబ్బారెడ్డికి అఖిలప్రియకు మధ్య దూరం పెరిగింది.ఈ పరిణామాలపై పార్టీ నాయకత్వం ఏ రకంగా వ్యవహరిస్తోందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios