కడపలో ఉక్కు ప్యాక్టరీ స్థాపించడాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉండగానే వ్యతిరేకించారని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఇపుడు ఎన్నికల సమయంలో వచ్చి పోరాడతానంటే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. అసలు కడప జిల్లా అంటేనే ముందు నుండి చంద్రబాబుకు కడుపు మంట అని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో కడప జిల్లా కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసినారు. ఇన్నాళ్లు గుర్తురాని జిల్లా ఇపుడు ఎన్నికలు దగ్గరపడుతుండగా గుర్తొచ్చిందా అంటూ చంద్రబాబు ను ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి.  
 
ఇక చంద్రబాబు కడపలో సీఎం రమేష్ దీక్షను విరమింపజేయడానికి వచ్చినపుడు చేసిన ప్రసంగాన్ని శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు.  బానిసలం కాదని చెప్పుకుంటున్న  చంద్రబాబే కేంద్రానిక బానిసత్వం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు వంటి కేసుల నుండి బైటపడేందుకు చంద్రబాబు కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాని అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్న మాట వాస్తవం కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆనాడే ఈ ప్యాకేజీకి ఒప్పుకోకుండా స్పెషల్ స్టేటస్ అడిగివుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదని అన్నారు. ఇలాంటి తప్పులు చేసిన చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. 
 
ఇక మీడియాను వాడుకుని చంద్రబాబు ప్రచార ఆర్భాటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, గంటలకు గంటలు స్పీచ్ లు ఇవ్వాడమే తప్ప అభివృద్దిని పట్టించుకున్న పాపాన పోడని విమర్శించారు. రాష్ట్రం కోసం ఏదోచేస్తున్నట్లు పోరాట యోదుడినని సీఎం చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని, కానీ అసలైన పోరాటయోదుడు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఇక మంత్రి దేవినేని ఉమపై కూడా శ్రీకాంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. మంత్రి నీచమైన మాటలు మాట్లాడటం మానుకోవాలని, ఇలాగే మాట్లాడితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. మంత్రి ఉమ తన వదినకు ఎలా అన్యాయం చేశాడో అందరికి తెలుసని అన్నారు. 

కుటుంబ రావు  బిజెపి గుట్టు బైటపెడతానని ప్రకటించి సైలెన్స్ అయిపోవడం వెనుక చంద్రబాబు ఉన్నాడని శ్రీకాంతద్ రెడ్డి పేర్కొన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమే ఈ ప్రకటన చేయించారని తెలిపారు. వారం రోజుల్లో అన్ని విషయాలు బైటపెడతానన్న వ్యక్తి ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు.

ఇక ప్రపంచంలో ఎం జరిగినా దాన్ని వైఎస్సార్ సిపి పార్టీకి అంటగట్టాలని టిడిపి నాయకులు, వారి అనుకూల మీడియా చూస్తున్నాయని మండిపడ్డారు. అసలు కత్తి మహేష్ కు వైఎస్సార్ సిపి పార్టీకి సంబంధమే లేదని స్పష్టం చేశారు. హిందువుల ఆరాశ్య దైవం రాముడిపై అతడు చేసిన అనుచిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఇక ప్రచారం కోసమే చంద్రబాబు ఏరువాక సందర్భంగా పొడి నేలలో వరి నాట్లు వేశారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాలికి బురద అంటుతుందనే కారణంగా సీఎం ఇలా పొడినేలలో ట్రాక్టర్ ఎక్కడం, వరి వేయడం చేశారని విమర్శించారు. ఈ వార్త చూసిన రాయలసీమ ప్రజలు తనకు ఫోన్ చేసి ఒకసారి ఈ పొడినేలలో వరి టెక్నాలజీ గురించి తమకు తెలియజేయాలని కోరుతున్నట్లు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.