ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. అడ్డంగా బలిసిన వాళ్లకి కాదు, నిరుపేదలకే ఇల్లు ఇస్తామని రోజా వెల్లడించారు. ప్రతి అర్హుడికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆమె తెలిపారు. 

కాగా, ఇళ్ల పట్టాల ముసుగులో సాగిన దోపిడీపై సిబిఐతో విచారణ జరిపించాలని అచ్చెన్నాయుడు నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇళ్ల పట్టాల పండగ పేరుతో సొంత స్థలాలకు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇస్తూ ప్రజలను జగన్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు

తన నియోజకవర్గంలోని ఒక గ్రామంలో 37 మందికి పట్టాలిస్తున్నట్లు చెప్పిన అధికారులు ఏడుగురికే పట్టాలిచ్చి మిగిలినవారికి వారి సొంత స్థలాలకు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు.

పేదల నుంచి తక్కువ ధరకు భూములు కొని, ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వైసిపి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా రూ.4 వేల కోట్ల వరకు దోపిడీ చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

సిబిఐ విచారణకు సిఎం ఆదేశించకపోతే దోపిడీని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతామని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే.