తిరుమల: తాను ఎమ్మెల్యే కావాలన్నదే తన లక్ష్యమని అది రెండు సార్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని స్పష్టం చేశారు నగరి ఎమ్మెల్యే రోజా. తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 

జగన్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని, జీవితాంతం పోరాడుతూనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎప్పుడూ జగన్ అడుగులో అడుగేసి నడుస్తానని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అఖండ విజయం సాధించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో రోజాకు మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతున్న వార్తలపై రోజా స్పందించారు. 

జగన్ ఏ బాధ్యత పెట్టినా తాను సమర్ధవంతంగా నిర్వహిస్తానని ఆమె స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రజల కోసం జగన్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు రోజా.  

చంద్రబాబు నాయుడు దుబారా ఖర్చుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు చేసింది గోరంత అయితే కొండంత చేసినట్లు ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. 

వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాకాదని ప్రజల ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ప్రమాణ స్వీకారాన్ని సైతం సింపుల్ గా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఆర్థిక వ్యవస్థను కాపాడటంలో జగన్ ప్రత్యేక చొరవ చూపడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలు అమలుకోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇకపోతే తనను ఐరన్ లెగ్ అంటూ టీడీపీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

1999 ఎన్నికల్లో తాను చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ప్రచారం నిర్వహించానని ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని ఆ విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు. ఐరన్ లెగ్ అని ముద్రవేసి జగన్ నుంచి తనను దూరం చేయాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పే వారికి చెంపపెట్టులాంటిదన్నారు.

అయితే వాటన్నింటిని పట్టించుకోకుండా వైయస్ జగన్ తనను సొంత చెల్లెలుగా భావించి తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. నగిరి నియోజకవర్గంలో తనను గెలవకుండా ఎన్ని కుట్రలు చేసినా వాటన్నింటని జగన్ సహకారంతో త్యజించి విజయం సాధించానని రోజా స్పష్టం చేశారు.