తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుకు ఆరోగ్యం క్షీణించి, బ్రెయిన్ లో ఉండే చిప్‌ పాడైనట్లు తమకు అనిపిస్తోందని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఇక ఆయన కుమారుడు నారా లోకేష్ అయితే తలలో బ్రెయిన్, చిప్ రెండూ లేవు అన్నట్లు మాట్లాడుతున్నాడని రాజా విమర్శించారు. 

''వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే ఎన్నో గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తుంటే... ప్రతీదానికి చంద్రబాబునాయుడు శతవిధాలా అడ్డుతగలడానికి ప్రయత్నిస్తున్నారు. రకరకాల అసత్య ప్రచారాలు చేస్తూ కులం, మతం కార్డు బయటికి తీసి సీఎం జగన్‌ చేసే మంచి పనులను ఏదో విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారు'' అని ఆరోపించారు. 

''చంద్రబాబునాయుడికి ప్రజల బాగోగులు, పేద ప్రజల సంక్షేమం కన్నా తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే ముఖ్యం. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నోట్లో వేలు పెడితే కొరకరలేడు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. 2015 ఏప్రిల్‌ 28వ తేదీన మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర 250 మత్స్యకార గుడిసెలు తగులబెట్టించారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని చీమకు కూడా హాని చేయడని చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదం'' గా వుందన్నారు. 

'' ఇక పోలీసులే రవీంద్ర ఫోన్‌ తీసుకుని మాట్లాడారని చంద్రబాబు అంటున్నారు.  రవీంద్ర ఫోన్‌కు హత్యకు ముందే నిందితులు ఫోన్‌ చేయడమే కాదు... హత్య అయిపోయిందని కూడా వారే ఫోన్‌ చేసి చెప్పారు.  చంద్రబాబు మాటలు ప్రజలను, కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి'' అని మండిపడ్డారు. 

'బీసీ నాయకులపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు అంటున్నారు. మా ప్రభుత్వం ఏ ఒక్కరి మీద అయినా తప్పు చేయని వ్యక్తుల మీద కేసులు పెట్టిందా? అని ప్రశ్నిస్తున్నాం. తప్పులు చేస్తే కేసులు పెట్టకుండా చంద్రబాబు చెప్పారని వదిలేయాలా..? తప్పుచేసిన వారి మీదే కేసులు పెట్టాం కానీ తప్పుచేయని వారిపై ఎటువంటి కేసులు పెట్టలేదు. కొల్లు రవీంద్ర అయినా అయ్యన్నపాత్రుడయినా ఎవరైనా సరే తప్పుచేస్తే వదిలేయాలా? చట్టం ముందు అందరూ సమానులు కారని చంద్రబాబు చెప్పదలచుకున్నారా?'' అని ప్రశ్నించారు. 

read more   కొనసాగుతున్న టిడిపి నాయకుల అరెస్టులు...పోలీసుల అదుపులో విశాఖ జిల్లా మాజీ మంత్రి

''యనమల రామకృష్టుడు సొంత రైస్‌మిల్‌లో ఎస్సీ మహిళ భర్తను తీసుకొచ్చి రెండో పెళ్ళి చేస్తుంటే భార్య వెళ్లి దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు రిజిస్టర్‌ చేయడం తప్పని చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులైతే మాత్రం ఎన్ని తప్పులయినా చేయవచ్చా చంద్రబాబు గారూ.. ? ప్రతీ దానికీ కులం.. కులం అంటున్నారు'' అని అడిగారు. 

''ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా 30 లక్షల ఇళ్ళ పట్టాలు ప్రతీ పేదవాడికి పంచాలని ముఖ్యమంత్రి జగన్‌ గారు చేస్తున్న ప్రయత్నాన్ని కోర్టుల ద్వారా మోకాలడ్డటానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా..? చంద్రబాబు ఎంత అడ్డుకున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏవీ ఆగవు, జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేదలకు మంచే జరుగుతుంది కానీ ఎట్టిపరిస్థితుల్లో చెడు జరగదు'' అని అన్నారు. 

''పేదలకు ఇళ్ళిస్తే చంద్రబాబుకు వచ్చిన భాదేంటి..? పైగా ఎందుకు దొంగ దీక్షలు... నటనలు..?  మీ 5 ఏళ్ళ పాలనలో కనీసం ఒక్కరికైనా ఇళ్ళ స్థలం పట్టా ఇచ్చారా..? చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు గానీ, ఆయన పెట్టిన టిడ్కో బకాయిలు రూ. 3 వేల కోట్లు, హౌసింగ్‌ కు సంబంధించి ఇతర బకాయిలు మరో రూ. 1300 కోట్లు ఇలా మొత్తంగా రూ. 4,300 కోట్లు బాకీ పెట్టి దిగిపోయాడు. అధికారంలో ఉన్నంతకాలం మీరు తప్పుడు పనులు  చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటారా..?'' అని మండిపడ్డారు. 

''ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లో, ఈ కోవిడ్‌ సమయంలో కూడా పేదల గృహ నిర్మాణానికి సంబంధించి జగన్‌ తన మాటకు కట్టుబడ్డారు.  ఆగస్టు 15 నాటికి రిజిస్ట్రేషన్లు చేసి ఇళ్ళ స్థలాల పట్టాలను ఈ 30 లక్షల మంది అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడతాం'' అని రాజా స్పష్టం చేశారు.