విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన టిడిపి నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టయ్యారు. పెందుర్తి రాతిచెరువు సమీపంలో ఉన్న టిడ్కొ ఇళ్ల నిర్మాణ పనులను సందర్శించేందుకు వెళ్లిన ఆయనను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 

గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇల్లు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ సత్యనారాయణ ఆద్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాగా కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడటంతో బండారు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

read more  అచ్చెన్నను వెంటనే రిలీజ్ చేయాలి.. బండారు సత్యనారాయణ

టిడిపి నిరసనలపై పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నరెడ్డి అదీప్ రాజ్ స్పందించారు. పేదలకు ఇళ్ళు పట్టాల పంపిణీపై టిడిపి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారుని... ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ 23 కాదు అసలు మూడు స్థానాలే  కూడా రావన్నారు. ఇప్పటిలా కనీసం ప్రతిపక్షహోదా కూడా వుండదు అని హెచ్చరించారు.  

తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు దివంగత ఎన్టీఆర్ రామారావు నుండి లాక్కున్నారని ఆరోపించారు.  అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రతి దాన్నీ రాజకీయ చేయడం సరి కాదన్నారు. గత ఐదు సంవత్సరాలు టిడిపి ప్రభుత్వం ఎం చేసిందో గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి అని నిలదీశారు. ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానండి అని సూచించారు. 

''మీరు అవినీతి గురుంచి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. మీ ప్రభుత్వం సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాలో ముక్కి పోయిన పప్పు,  బెల్లం, ఇచ్చారు. కానీ వైయస్సార్ ప్రభుత్వం ప్రతి ఆడపడుచు అకౌంట్లో 15 వేల రూపాయలు జమ చేసింది. ప్రభుత్వం చేస్తున్న  సంక్షేమ పథకాల్లో అడ్డుకోవడం తప్పు'' అని వైసిపి ఎమ్మెల్యే ఆదిప్ రాజు అన్నారు