Asianet News TeluguAsianet News Telugu

క్రాస్ ఓటింగ్‌పై ఆధారాలున్నాయి.. వైసీపీ నుంచి కాదు, టీడీపీ నుంచే ప్రమాదం : శ్రీదేవికి నందిగం సురేష్ కౌంటర్

జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఎవ్వరి వల్లా కాదన్నారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. వైసీపీ బహిష్కృత నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఆయన కౌంటరిచ్చారు. ఆమెకు టీడీపీ నుంచే ప్రమాదమని, ఏపీలో పూర్తి రక్షణ వుందని సురేష్ అన్నారు. 
 

ysrcp mla nandigam suresh counter to mla vundavalli sridevi
Author
First Published Mar 26, 2023, 3:11 PM IST

వైసీపీ బహిష్కృత నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కౌంటరిచ్చారు ఎంపీ నందిగం సురేష్. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉండవల్లి శ్రీదేవి విమర్శలు చేసే ముందు ఆలోచించాలని హెచ్చరించారు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. తమ నుంచి ఉండవల్లి శ్రీదేవికి ఎలాంటి ఆపద వుండదని.. ఆమె పార్టీ స్టాండ్ దాటారని, అందుకే వేటు పడిందని నందిగం సురేష్ అన్నారు. టీడీపీకి ఓటేసి.. అమరావతి రాజధాని అంటూ శ్రీదేవి ఏదేదో మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. ఉండవల్లి శ్రీదేవికి ఏపీలో పూర్తి రక్షణ వుందని.. ఆమెకు టీడీపీ నుంచే ప్రమాదమని సురేష్ హెచ్చరించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారని ఆయన ఆరోపించారు. జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఎవ్వరి వల్లా కాదని సురేష్ తేల్చిచెప్పారు. 

కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తాను  క్రాస్ ఓటింగ్  చేసినట్టుగా  ఆరోపణలు  చేసిన  వైసీపీ నేతలకు  రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని  ఎమ్మెల్యే  ఉండవల్లి శ్రీదేవి  చెప్పారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మూడు  రోజులుగా  తనపై  సోషల్ మీడియాలో  అసత్య ప్రచారం చేస్తున్నారన్నారని కొన్ని మీడియా చానెల్స్,  కొందరు వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆమె  ఆరోపించారు.  తాను ఎలాంటి అక్రమాలకు  పాల్పడలేదని శ్రీదేవి  స్పష్టం  చేశారు.  అమరావతి ప్రాంతంలో  ఉన్న తనను రాజకీయంగా వైసీపీ నేతలు  టార్గెట్  చేశారని  ఆమె  ఆరోపించారు.  డబ్బులు  ఇచ్చి తనపై, కార్యాలయంపై  దాడులు  చేయించారన్నారు.   తాను  ఎమ్మెల్యేగా  విజయం సాధించిన రోజు నుండి తనను వేధిస్తున్నారన్నారని శ్రీదేవి ఆరోపించారు.

Also REad: రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తా: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీపై ఉండవల్లి శ్రీదేవి ఫైర్

ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  తాను  ఎవరికి ఓటు  చేసిందో  వైసీపీ నాయకత్వానికి  తెలుసునని  ఉండవల్లి శ్రీదేవి  చెప్పారు. 22వ ప్యానెల్ లో  జనసేన ఎమ్మెల్యే లేరా, విశాఖ జిల్లాకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యే  లేరా  అని ఉండవల్లి శ్రీదేవి  ప్రశ్నించారు.  ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుండే తనపై కుట్రలు  చేస్తున్నారని ఆమె  ఆరోపించారు.   తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నట్టుగా  నిరూపిస్తారా అని శ్రీదేవి సవాల్  విసిరారు. ఈ విషయమై అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దామా అని  ఆమె  వైసీపీ నేతలను కోరారు. తనను గెలిపించిన ప్రజల కోసం ఇక నుండి పోరాటం  చేస్తానన్నారు. తాను ఒక డాక్టర్ అని, తన భర్త కూడా డాక్టర్ అని ,తమకు రెండు ఆసుపత్రులు కూడా  ఉన్నాయన్నారు. తాను డబ్బులు తీసుకొని ఓటు వేయాల్సిన అవసరం లేదని  ఎమ్మెల్యే శ్రీదేవి  చెప్పారు. తనకు  ఏమైనా జరిగితే  ఏపీ ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డిదే  బాధ్యత  అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios