రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీపై ఉండవల్లి శ్రీదేవి ఫైర్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పంందించారు.
అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా ఆరోపణలు చేసిన వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో పార్టీ నుండి ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పండ్ చేసింది. ఈ విషయమై ఆదివారంనాడు ఆమె హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని మీడియా చానెల్స్, కొందరు వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో ఉన్న తనను రాజకీయంగా వైసీపీ నేతలు టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. డబ్బులు ఇచ్చి తనపై కార్యాలయంపై దాడులు చేయించారన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజు నుండి తనను వేధిస్తున్నారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు చేసిందో వైసీపీ నాయకత్వానికి తెలుసునని ఉండవల్లి శ్రీదేవి చెప్పారు.22వ ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే లేరా, విశాఖ జిల్లాకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యే లేరా అని ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుండే తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నట్టుగా నిరూపిస్తారా అని ఆమె సవాల్ విసిరారు. ఈ విషయమై అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దామా అని ఆమె వైసీపీ నేతలను కోరారు. తనను గెలిపించిన ప్రజల కోసం ఇక నుండి పోరాటం చేస్తానన్నారు.
తాను ఒక డాక్టర్ అని, తన భర్త కూడా డాక్టర్ అని ఆమె గుర్తు చేశారు. తమకు రెండు ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. తాను డబ్బులు తీసుకొని ఓటు వేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు. తనకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బాధ్యత అని హెచ్చరించారు.
గత ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే ఉంటుందని తాను ప్రజలకు వాగ్ధానం చేశానన్నారు. జగన్ ఇల్లు ఇక్కడే కట్టుకున్నారని ప్రజలకు చెప్పానన్నారు. తన మాటలను నమ్మి ప్రజలు తనను గెలిపించారని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. మన అమరావతి మన రాజధాని అని ఆమె చెప్పారు. అమరావతి కోసం ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన అభివృద్దిలో 10 శాతమైనా చేశామా అని ఆమె ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా తనపై అనవసర నిందలు వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేశానని తన కార్యాలయంపై దాడి చేశారన్నారు. ఈ దాడితో తనకు భయం వేస్తుందన్నారు. ప్రస్తుతం తాను హైద్రాబాద్ లో ఉంటున్నానని ఆమె చెప్పారు. ఏపీకి రావాలంటేనేి భయం వేస్తుందన్నారు..మహిళా అని చూడకుండా ఇష్టారీతిలో తనను విమర్శిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న ఎలా చనిపోయారనేది ప్రజలందరికీ తెలుసునన్నారు.
జగనన్న ఇళ్ల పథకం వేల కోట్లు దోచుకుంటున్నారని ఆమె చెప్పారు. ఉద్దంరాయునిపాలెంలో ఇసుక మాఫియా ఎవరిదని ఆమె ప్రశ్నించారు. అభివృద్ది అనేది పక్కా స్కామ్ అని ఆమె ఆరోపించారు. సామాన్యులు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుండి తనకు ప్రాణహని ఉందని ఆమె ఆరోపించారు.
నిన్నటి నుండి ఎమ్మెల్యే శ్రీదేవి ఎక్కడ అని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారన్నారు. తాను ఏమైనా గ్యాంగ్ స్టర్ నా అని ఆమె ప్రశ్నించారు. సీక్రెట్ బ్యాలెట్ లో ఓటు వేస్తే వారికెలా తెలుస్తుందని ఆమె ప్రశ్నించారు. తనను పిచ్చికుక్కతో సమానంగా చూశారని ఆమె ఆవేదన చెందారు. ఏపీలో మహిళకు రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని ఉండవల్లి శ్రీదేవి చెప్పారు
also read:కేసులు ఎదుర్కొనేందుకు రాజకీయాల్లోకి రాలేదు: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీపై ఆనం ఫైర్
. ఎన్‌హెచ్ఆర్ సీ హమీ ఇస్తేనే ఏపీలో అడుగు పెడతానన్నారు. రేపు తాను కూడా చనిపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఏపీలో అడుగు పెట్టడం లేదన్నారు. జగన్ కొట్టిన దెబ్బకు తన మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలనే ఆలోచన లేదన్నారు.