ఉనికి కోసమే వ్యాఖ్యలు.. చంద్రబాబు, పవన్‌లు అధికారంలోకి రారు.. వాళ్లకూ తెలుసు : ప్రసన్నకుమార్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు వైసీపీ నేత , నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వాళ్లిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యేది లేదని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు వైసీపీ నేత , నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రామని టీడీపీ, జనసేనలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యేది లేదని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
వైఎస్ జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని నల్లపరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గరపడుతూ వుండటంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తమ ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మళ్లీ జగన్ సీఎం కావడం ఖాయమని నల్లపరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: లోకేష్ ఓ బచ్చా.. అవినీతికి పాల్పడ్డానని తేలితే ఉరేయండి : నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
అంతకుముందు ఈ నెల ప్రారంభంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కళ్లున్న వారికే అభివృద్ధి కనిపిస్తుందని, బచ్చా లోకేశ్‌కు ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే బుచ్చిరెడ్డిపాలెం నడిరోడ్డులో ఉరేయ్యాలని నల్లపురెడ్డి సవాల్ విసిరారు. లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలపై జగన్‌ను కలిసి సీబీఐని విచారణ వేయాల్సిందిగా కోరతానని ఎమ్మెల్యే చెప్పారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు.
తన వద్ద రూ.1500 కోట్లు వుంటే నెల్లూరు జిల్లాలో టీడీపీనే లేకుండా చేస్తానని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ కుటుంబానికి 16 వేల ఎకరాల భూమి వుంటే పేదలకు పంచిపెట్టామని ప్రసన్నకుమార్ రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ నేతలను తన ఇంటికి పంపితే ఆస్తి వివరాలు ఇస్తానని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబుకు ఆయన తండ్రి రెండెకరాల పొలం ఇస్తే.. ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నల్లపురెడ్డి ప్రశ్నించారు. తన గురించి సోమిరెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డిలను అడిగి తెలుసుకోవాలని లోకేష్‌కు చురకలంటించారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు.