అమరావతి: మాజీమంత్రి, ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. చంద్రబాబు హయాంలో హిందుమతానికి జరిగిన అవమానం ఎన్నడూ జరగలేదన్నారు. ఆనాడు మంత్రిగా మాణిఖ్యాలరావు ఉన్నారన్న విషయం ప్రజలకు తెలుసునన్నారు. 

మాణిక్యాలరావు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడే దుర్గ గుడిలో,శ్రీ కాళహస్తి లో తాంత్రిక పూజలు జరిగిన విషయాన్ని మరచిపోయారా అని ప్రశ్నించారు. విజయవాడలో 50 హిందు దేవాలయాలను కులదోశారు అది మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. పోనీ గోదావరి పుష్కరాల మరణాలు ఎవరి హయాంలో జరిగాయో అందరికీ తెలుసునన్నారు. 

సీఎం వైయస్ జగన్ చేస్తున్న మంచి పనులతో టీడీపీ, బీజేపీకి రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయంతో తప్పుడు ప్రచారం చేస్తారా అని మండిపడ్డారు. జగన్ హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ మాజీమంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యాఖనించడాన్ని తప్పుబట్టారు. 

దేవుడు భూములు అప్పనంగా కాజేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదంటూ మండిపడ్డారు. సదావర్తి దేవుడు భూముల కాజేసిన విషయాన్ని మరచిపోయారా అంటూ ప్రశ్నించారు.  చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆర్టీసీ బస్ టికెట్స్ పై హజ్ యాత్ర గురించి ప్రచురించబడిన విషయాన్ని గుర్తు చేశారు. నేటికీ అవే ఆర్టీసీలో ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.  

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడుతున్నారని విమర్శించారు. ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇమామ్ లు గురించి, హజ్ యాత్ర, జెరూసలేం గురించి బస్ టికెట్స్ మీద ప్రచారం చేయించిన విషయాన్ని మల్లాది విష్ణుగుర్తు చేశారు.  బస్ టికెట్స్ మీద ఉన్న వాటికి తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా బస్ టికెట్స్ మీద ప్రచారం కోసం జీవోలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు.   

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని మతాలు, ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు అంటే సమానమేనని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 
ఆర్టీసీ బస్ టికెట్స్ వ్యవహారంపై ఇప్పటికే విచారణకు దేవాదాయశాఖ మంత్రి ఆదేశించారని చెప్పుకొచ్చారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

మరోవైపు విజయవాడలో ఆవుల మరణానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటని నిలదీశారు. బీజేపీ మంత్రి మాణిక్యాలరావు ఉండగానే రాష్ట్రంలో చాలా ఆవులు చనిపోయాయని దానికి బీజేపీ బాధ్యత వహిస్తుందా అంటూ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు తెలుగుదేశం, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.