అమరావతి: ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు దర్జాగా కుర్చీలలో కూర్చొని రాజ్యమేలుతారు. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు తెలుపుతాయి. ఇవి రాజకీయాల్లో సహజంగా కనిపిస్తాయి. కానీ ఏపీలో సీన్ రివర్స్ అయ్యింది. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రైతులతో కలిసి ధర్నాకు దిగడం చర్చనీయాంశంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్ట్‌ వద్ద రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేనువు ప్రాజెక్టుకు నీరు తరలించేలా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

సమాచారం అందుకున్న వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. రైతులతో కలిసి ధర్నాకు దిగారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేనువు ప్రాజెక్టుకు నీరు తరలించేలా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. 

రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే ధర్నాకు దిగారంటూ వార్తలు రావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. విషయం తెలుసుకుని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 

దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పందించారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నీరు తీసుకెళ్లే అంశంపై ఆరా తీశారు. అనంతరం జీవోను రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ధర్నా విరమించారు.