అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

వీడ్కోలు సభలో గవర్నర్ స్వయంగా సీఎం జగన్ పాలనను మెచ్చుకున్నారని అది చూసి చంద్రబాబు నాయుడు ఓర్వ లేకపోతున్నారంటూ మండిపడ్డారు. సీఎం జగన్ కు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక టీడీపీ కుట్రలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా ఖబడ్డార్ ఖబడ్డార్ చంద్రబాబూ అంటూ రెచ్చిపోయారు. మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో అంటూ తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి అనేక అవకాశాలు కల్పిస్తున్నామని వాటిని సద్వినియోగపరచకుండా రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

గతంలో సభలో తాము ఎంత వేడుకున్నా తమకు మైకు ఇవ్వలేదని గుర్తు చేశారు. 63మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నేత జగన్‌కు కూడా మాట్లాడేందుకు అవకాశమే ఇచ్చేవారు కాదని, సభలో ఏదైనా మాట్లాడాలంటే అధ్యక్షా మైకు.. అధ్యక్షా మైకు.. అంటూ బతిమాలాడుకోవాల్సిన దుస్థితి ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ తమ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని గౌరవించి మాట్లాడే అవకాశం ఇస్తే దుర్వినియోగం చేస్తూ రాద్ధాంతం చేస్తారా అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిలదీశారు.